Global Stocks | ఉక్రెయిన్‌పై దండయాత్ర రష్యా స్టాక్ మార్కెట్‌ను కుదిపేసింది. గురువారం ట్రేడింగ్‌లో రష్యా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద 259 బిలియన్ల డాలర్లు హరించుకుపోయింది. ఉక్రెయిన్‌పై సైనిక దాడి నేపథ్యంలో రెండు గంటల పాటు స్టాక్స్ ట్రేడింగ్ నిలిపేశారు. ఆతర్వాత మొదలైన ట్రేడింగ్‌లో మాస్కో స్టాక్ ఎక్స్చేంజ్లో రష్యన్ స్టాక్స్ 50 శాతానికి పైగా నష్టపోయాయి. పశ్చిమ దేశాల ఆంక్షలు పూర్తిగా అమల్లోకి రాకముందే రష్యా సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిగింది. స్బేర్ బ్యాంక్ పీజీఎస్ఈ షేర్ల 45 శాతం (114 రూబుల్స్) మేర పతనం అయ్యాయి. గాజ్‌ప్రామ్ పీజీఎస్ఈ 39 శాతం పడిపోయింది.
గురువారం స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో రెండు గంటల పాటు స్టాక్స్ ట్రేడింగ్ నిలిపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ట్రేడింగ్ మొదలయ్యాక స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్టీఎక్స్ ఇండెక్స్ 50.05 శాతం అంటే 612.69 పాయింట్లు నష్టపోయింది. మొయిక్స్ బ్రాడ్ మార్కెట్ 44.59 శాతం (1,226.65 పాయింట్లు) పతనం అయ్యాయి.
రష్యా కరెన్సీ రూబుల్ రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2009 తర్వాత రూబుల్ ఇలా పతనం కావడం ఇదే ప్రథమం. దాదాపు 45 శాతం షేర్లు భారీగా నష్టపోయాయి. రూబుల్ మరింత పతనం కాకుండా ఫైనాన్సియల్ మార్కెట్లోఅనిశ్చితి తలెత్తకుండా రష్యా సెంట్రల్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి ఎంటరైంది. ఏండ్ల తర్వాత రష్యా సెంట్రల్ బ్యాంక్ మార్కెట్లో జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. దేశీయ బ్యాంకులకు అదనంగా లక్ష కోట్ల రూబుల్స్ (11.5 బిలియన్ డాలర్లు) నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చింది. ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు బెంచ్‌మార్క్ వడ్డీరేటు 535 బేసిక్ పాయింట్లు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రూబుల్ భారీగా నష్టపోకుండా నివారించేందుకే రష్యా సెంట్రల్ బ్యాంక్ ఫైనాన్సియల్ మార్కెట్లో జోక్యం చేసుకున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.
ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో రష్యా సైనిక చర్యకు దిగడంతో అమెరికా డాలర్ మారకం విలువ, బంగారం, ముడి చమురు ధర పైపైకి దూసుకెళ్లాయి. గ్లోబల్ స్టాక్స్, యూఎస్ బాండ్లు మాత్రం నష్టపోయాయి. టోక్యో నిక్కీ 2.4 శాతం పతనమైంది. యూఎస్ స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ భారీగా నష్టపోయింది. ఎస్ అండ్ 500 ఈ-మినిస్ 2.3 శాతం, నాస్డాక్ ఫ్యూచర్స్ 2.8 శాతం పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 3.5 శాతానికి పైరిగి 100 డాలర్ల మార్క్‌ను దాటేసింది. 2014 సెప్టెంబర్ తర్వాత ముడి చమురు ధర 100 డాలర్లు దాటడం ఇదే ఫస్ట్ టైం. స్పాట్ గోల్డ్ ధర 1.7 శాతానికి పైగా పెరిగింది. గతేడాది జనవరి తర్వాత గరిష్ఠంగా పుత్తడి పెరగడం ఇదే మొదటిసారి. ఇన్వెస్టర్లకు బంగారం స్వర్గధామంగా కనిపిస్తున్నది. ఇక క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ 35 వేల డాలర్ల దిగువన ట్రేడయింది.. గత నెల రోజుల్లో బిట్‌కాయిన్ కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.