ముంబై, మే 12 : రూపాయి కకావికలమవుతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న మారకం విలువ పాతాళంలోకి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం మరో 40 పైసలు కోల్పోయి చారిత్రక కనిష్ఠ స్థాయి 95.68కి జారుకున్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అలజడికి కారణమైందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. పశ్చిమాసియాలో పది వారాలుగా కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాను మరింత కఠినతరం చేస్తున్నదన్న భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని తెలిపారు.
అమెరికా మద్దతు ఉన్న శాంతి ప్రతిపాదనపై టెహ్రాన్ ఇచ్చిన తాజా స్పందనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తిరస్కరించిన తర్వాత ఆ భయాలు మరింత పెరిగాయి. వీటికి తోడు చమురు వినియోగం తగ్గించడంతోపాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని ప్రధాని సూచన కూడా కరెన్సీ మార్కెట్లో అలజడికి కారణమైందన్నారు. 95.57 వద్ద ప్రారంభమైన డాలర్-రూపాయి ఇంట్రాడేలో చారిత్రక కనిష్ఠ స్థాయి 95.74కి పడిపోయింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 40 పైసలు కోల్పోయి 95.68 వద్ద స్థిరపడింది. సోమవారం కూడా 79 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.