ముంబై, డిసెంబర్ 9: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతోపాటు దేశీయ ఈక్విటీలు కుదేలవడంతో కరెన్సీ విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 20 పైసలు నష్టపోయి నెల కనిష్ఠ స్థాయిని 84.86ని తాకింది. మునుపెన్నడు లేని స్థాయికి పతనమైనట్లు అయింది.
డాలర్‌కు అనూహ్యంగా దిగుమతిదారుల, విదేశీ బ్యాంకుల నుంచి డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 84.70 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 84.86 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి కరెన్సీ విలువై 20 పైసలు కోల్పోయి 84.86 వద్ద ముగిసింది.
గత శుక్రవారం 5 పైసలు పెరిగి 84.66 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న చారిత్రక కనిష్ఠ స్థాయి 84.75ని తాకిన విషయం తెలిసిందే. రూపాయి పతనంతో భారత్ దిగుమతులపై అధికంగా చెల్లింపులు జరుపాల్సి ఉంటుంది.