ముంబై, డిసెంబర్ 15: రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు ఢీలాపడుతున్నాయి. ఇదే క్రమంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో 90.80కి పడిపోయిన మారకం విలువ చివరికి 90.78 వద్ద ముగిసింది. గత శుక్రవారం ముగింపుతో పోలిస్తే 29 పైసలు నష్టపోయినట్టు అయింది.
అమెరికా-భారత్ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంపై అనిశ్చిత స్థితి నెలకొనడం, విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. మరోవైపు, దిగుమతి దారుల నుంచి డాలర్‌కు డిమాండ్ నెలకొనడం, మదుపరుల్లో సెంటిమెంట్ దెబ్బతినడం కూడా రూపాయి పతనాన్ని శాసించింది.
90.53 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 90.51 గరిష్ఠ స్థాయిని తాకగా.. ఇంట్రాడేలో 31 పైసలు పడిపోయి 90.80 చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. చివరకు గత ముగింపుతో పోలిస్తే 29 పైసలు నష్టపోయి 90.78 వద్ద స్థిరపడింది. గత శుక్రవారం కూడా మారకం విలువ 17 పైసలు కోల్పోయి 90.49కి జారుకున్న విషయం తెలిసిందే. ఆసియా కరెన్సీలో అత్యంత వరెస్ట్ పనితీరు కనబరిచినది రూపాయి కరెన్సీ కావడం విశేషమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. సమీప భవిష్యత్తు కాలంలో డాలర్-రుపీ రేటు 90.50 నుంచి 90.95 మధ్యలో కొనసాగనున్నదని అంచనావేస్తున్నారు.