ముంబై, డిసెంబర్ 15: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం భారీగా కోలుకున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన రికార్డుస్థాయి లాభాలు, విదేశీ మదుపరుల నుంచి కొనసాగుతున్న పెట్టుబడులు, ఇతరత్రా ఫారిన్ ఫండ్స్‌తో ఫారెక్స్ మార్కెట్లో రూపీ ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజే ఏకంగా 27 పైసలు ఎగిసి 83.03 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు.. రూపీ సెంటిమెంట్‌ను బలపర్చాయని ఫారెక్స్ డీలర్లు చెప్తున్నారు. కాగా, ఉదయం ఆరంభంలో 83.30 వద్ద మొదలైన రూపాయి మారకం విలువ.. ఒక దశలో 83.32 స్థాయికి నష్టపోయింది. అలాగే మరొక దశలో 82.94 స్థాయికి పుంజుకున్నది. ఈ క్రమంలోనే చివరకు 83.03 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా రూపీ 37 పైసలు కోలుకున్నది. అమెరికా డాలర్ ఇండెక్స్ క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు స్థిరంగా 101.01 వద్దే ఉన్నది. వచ్చే ఏడాది వడ్డీరేట్లను తగ్గిస్తామంటూ ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఫెడ్ రిజర్వ్ ఇచ్చిన సంకేతాలు.. గురువారం పదేండ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ను 4 శాతం దిగువ స్థాయికి కుంగదీశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో 5 శాతానికి ఎగబాకిన విషయం తెలిసిందే. 2007 నుంచి ఇదే గరిష్ఠం.