ముంబై, జనవరి 20: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పతనమైంది. మంగళవారం ఫారిన్ ఎక్సేంజ్ ఇంటర్‌బ్యాంక్ వద్ద సోమవారం ముగింపుతో చూస్తే 7 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 90.97గా నమోదైంది. దీంతో గత ఏడాది డిసెంబర్ 16న నమోదైన 90.93 రికార్డు కనుమరుగైపోయింది. ఇదిలావుంటే ట్రేడింగ్ మధ్య ఒకానొక దశలో 91.06 స్థాయికి రూపీ వాల్యూ పడిపోవడం గమనార్హం.
మెటల్ దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించడమే కారణమని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. అలాగే దేశీయ మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చాయని అభిప్రాయపడుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలతో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తకర వాతావరణం పెరుగుతుండటం కూడా ఫారెక్స్ మార్కెట్‌ను గట్టిగానే ప్రభావితం చేస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు సైతం రూపీని కోలుకోకుండా చేశాయన్న అంచనాలూ వినిపిస్తున్నాయి.
మున్ముందు ఇబ్బందేనా?
తాజా పరిస్థితులనుబట్టి డాలర్ ముందు రూపీ మరింతగా బక్కచిక్కడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇదే జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావమే పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి విలువ తరిగిపోయినకొద్దీ విదేశాల నుంచి దేశంలోకి వచ్చే దిగుమతులు భారంగా మారుతాయని, ముఖ్యంగా ముడి చమురు ప్రియమైపోతుందని చెప్తున్నారు. రవాణా చార్జీలు, అధిక చెల్లింపులతో ద్రవ్యోల్బణం విజృంభించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఫలితంగా ఆర్బీఐ వడ్డీరేట్లు పెరిగి.. అన్ని రంగాలకు రుణ లభ్యత క్షీణిస్తుందని, ఇది వ్యాపార, ఉద్యోగ మార్కెట్లను కూలదోయవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.