Rupee @ 80.05 | అనుకున్నంత అయ్యింది. చరిత్రలో తొలిసారి అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.80 దిగువకు పతనమైంది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఏడు పైసలు నష్టపోయి రూ.80.05 ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. రూపాయి ఆల్‌టైం కనిష్ట రికార్డు నెలకొల్పడం చరిత్రలోనే తొలిసారి.
సోమవారం ట్రేడింగ్ ముగింపుతో పోలిస్తే మంగళవారం ఏడు పైసలు నష్టంతో ట్రేడింగ్ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరంగా కొనసాగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం దీనికి కారణం అని తెలుస్తున్నది. సోమవారం కూడా ఇంట్రా డే ట్రేడింగ్‌లో ఒకానొక దశలో ఆల్‌టైం కనిష్ట స్థాయి రూ.80.02 లకు పడిపోయింది.
రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరాం అయ్యర్ మాట్లాడుతూ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు నిరంతరాయంగా నిధులు ఉపసంహరించడంతో రూపాయి విలువ పతనానికి కారణం అని చెప్పారు. రూపాయి విలువ బలహీన పడకుండా ఆర్బీఐ జోక్యం చేసుకోవడం లేదని, ఫలితంగా సెంటిమెంట్ మరింత బలహీన పడిందన్నారు. చివరకు ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ముగింపు సమయానికి ఆరు పైసలు లాభ పడి రూ.79.92 వద్ద ముగిసింది.