న్యూఢిల్లీ, జూలై 20: రూపాయి క్షీణత ఆర్బీఐకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో ఎలాగైనా దేశీయ కరెన్సీ పతనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే రూపీని బలపర్చేందుకు ఏకంగా 100 బిలియన్ డాలర్లకుపైనే అమ్మేయాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకం నిల్వల్లో ఇది దాదాపు ఆరో వంతుకు సమానం కావడం గమనార్హం. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఫారెక్స్ మార్కెట్లో అంతకంతకూ నష్టపోయి చారిత్రక కనిష్ఠ స్థాయిలకు పడిపోతున్న విషయం తెలిసిందే. రోజుకింత దిగజారుతూ ఆల్‌టైమ్ లో రికార్డులను తాకుతున్నది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా 80 స్థాయినీ దాటేసింది. దీంతో ఇప్పుడు ఒక్కో డాలర్‌కు 80 రూపాయలను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రూపాయి మారకం విలువ ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా 7 శాతంపైనే నష్టపోయింది. పెరుగుతున్న దిగుమతులు, తరుగుతున్న ఎగుమతులతోపాటు దేశీయ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు రూపాయిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చివరకు విదేశీ డాలర్ డిపాజిట్ల నిబంధనల్నీ సడలించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు శూన్యం. దీంతోనే ఇప్పుడు డాలర్ అమ్మకాలను పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తున్నట్టు ఆర్బీఐ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే డాలర్ అమ్మకాలతో ఆర్బీఐ వద్ద ఈ విదేశీ మారకం నిల్వలు 60 బిలియన్ డాలర్లకుపైనే హరించుకుపోయాయి. నిరుడు సెప్టెంబర్‌లో 642.450 బిలియన్ డాలర్ల నిల్వలుండేవి. ఇప్పుడు 580 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇందులో 100 బిలియన్ డాలర్లు అమ్మాలని చూస్తున్నట్టు ఆర్బీఐకి చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు అంటున్నారు. ఆర్బీఐ జోక్యం చేసుకోకపోతే రూపాయి మరింతగా దిగజారడం ఖాయమన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు. రూ.85 స్థాయికి పడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. కాగా, ఇప్పటికీ డాలర్ నిల్వల్లో ప్రపంచంలో భారత్‌కు ఐదో స్థానం ఉన్నది. ఈ ధైర్యంతోనే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా రూపాయిని నిలబెట్టగలమన్న ధీమాను ఆర్బీఐ ప్రదర్శిస్తున్నది.
ఇటు దేశంలో.. అటు విదేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులూ రూపాయి విలువను ఆవిరి చేస్తున్నాయి. దేశీయంగా ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగిపోతుండటం, తద్వారా వాణిజ్య లోటు-కరెంట్ ఖాతా లోటు పరుగులు పెడుతుండటం, స్టాక్ మార్కెట్లు నష్టపోతుండటం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం రూపాయిని ఒడిదుడుకులకు లోనుచేస్తున్నది. ఇక అంతర్జాతీయంగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు వంటివీ ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా విదేశీ మదుపరులు దాదాపు 30 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. జనవరి నుంచి ప్రతినెలా వాణిజ్య లోటు సగటున 25 బిలియన్ డాలర్లుగా ఉంటున్నది.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత కొనసాగుతూనే ఉన్నది. బుధవారం ట్రేడింగ్‌లో మరో 13పైసలు పడిపోయి 80.05 వద్దకు దిగజారింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 80 దాటి ముగియడం ఇదే తొలిసారి. మంగళవారం ఇంట్రా-డేలో 80.05 స్థాయికి పతనమైనప్పటికీ.. తిరిగి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం ముగింపుతో చూస్తే 79.92 వద్ద నిలిచింది. అయితే డాలర్లకు మళ్లీ డిమాండ్ రావడంతో బుధవారం రూపీకి నష్టాలు తప్పలేదు.