Indian Rupee | ముంబై, ఫిబ్రవరి 5: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులుపడ్డాయి. అంతర్జాతీయ వాణిజ్యయుద్ధానికి అమెరికా కాలు దుయ్యనుండటంతో డాలర్ కరెన్సీ అనూహ్యంగా బలపడుతున్నది. దీంతో ఇతర కరెన్సీలు ఢీలా పడుతున్నాయి. దీంట్లోభాగంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఒకేరోజు 36 పైసలు కోల్పోయి చారిత్రక కనిష్ఠ స్థాయి 87.43 వద్దకు జారుకున్నది. అమెరికా-చైనా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం మరింత ముదురుతుండటంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.
దీంతోపాటు రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా కరెన్సీ పతనానికి ప్రధాన కారణమన్నారు. 87.13 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 87.49 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి 36 పైసల నష్టపోయి 87.43 వద్ద నిలిచింది. మంగళవారం నాలుగు పైసలు కోలుకొని 87.07 వద్ద స్థిరపడింది. రూపాయి పతనంతో దేశీయ దిగుమతులకోసం అదనంగా నిధులు వెచ్చించాల్సి వస్తున్నది. దేశీయ వినిమయంలో 80 శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు రూపాయి పతనం అధికంగా చెల్లించాల్సి ఉంటుందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.