Rupee | ముంబై, జూన్ 5: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీ కరెన్సీ నిలకడలేక నిలువునా పతనమైపోతున్నది. గత నెల ఈ ఏడాదిలోనే రూపాయికి అత్యంత చేదు జ్ఞాపకంగా నిలిచింది మరి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్లకు పెరుగుతున్న డిమాండ్.. రూపాయి ఊపిరిని తీసేస్తుండగా, దేశీయంగా నెలకొన్న వివిధ రకాల ప్రతికూల పరిస్థితులు సైతం కోలుకోనివ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే మే నెలలో రూపాయి మారకం విలువ దాదాపు 1 శాతం క్షీణించింది.
డిసెంబర్ తర్వాత..
నిరుడు డిసెంబర్ తర్వాత రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది ఈ ఏడాది మే నెలలోనే. దేశంలోకి పెరుగుతున్న దిగుమతులు.. క్షీణిస్తున్న ఎగుమతుల నేపథ్యంలో డాలర్ నిల్వలు సైతం తరిగిపోతుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మే 26 నాటికి నెల రోజుల కనిష్ఠాన్ని తాకుతూ ఫారెక్స్ నిల్వలు 589.14 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది.
పడిపోతే భారమే..
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతే అన్నింటిపైనా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దిగుమతయ్యే ప్రతీ వస్తూత్పత్తికి అధిక ధర చెల్లించాల్సి వస్తుంది. ఇక దేశీయ ఇంధన అవసరాలు ఎక్కువగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. క్షీణించే రూపాయి విలువ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పైకి చేర్చుతుంది. దీంతో రవాణా ఖర్చులు పెరిగి మార్కెట్లో ఉన్న ప్రతీదాని రేటు పరుగులు పెడుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, జీడీపీ పతనం, నిరుద్యోగం ఇలా అన్నీ అతలాకుతలమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2022లోనే రూ.8 పతనం
గత ఏడాది రూపాయి విలువ అత్యంత ఘోరంగా నష్టపోయింది. డాలర్‌తో పోల్చితే మారకం విలువ ఏకంగా ఈ ఒక్క సంవత్సరమే రూ.8.15 దిగజారింది. 2013 తర్వాత ఒక ఏడాదిలో రూపాయి మారకం విలువ ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి. అంతేగాక కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కూడా ఇదే గరిష్ఠ స్థాయి క్షీణత.
ఒక్కరోజే 24 పైసలు ఢమాల్
ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ భారీగా క్షీణించింది. తీవ్ర ఒడిదుడుకుల నడుమ డాలర్‌తో పోల్చితే రుపీ మారకం విలువ ఒక్కరోజే 24 పైసలు పడిపోయింది. చివరకు 82.63 వద్ద స్థిరపడింది. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో 82.47 వద్ద మొదలైన రూపాయి.. ఒకానొక దశలో కనిష్ఠ స్థాయి 82.45 వద్దకు చేరగా, మరొకసారి 82.68 స్థాయికి దిగజారింది. శుక్రవారం 82.39 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. దీంతో 24 పైసలు కోల్పోయినైట్టెంది.
B P