Rupee | న్యూఢిల్లీ, నవంబర్ 11: వచ్చే నాలుగేండ్లలో రూపాయి మారకం విలువ 8-10 శాతం పడిపోవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అంచనా వేస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో తాజాగా ఎస్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ట్రంప్ హయాంలో డాలర్‌తో పోల్చితే రుపీ మారకపు రేటు మరో రూ.10దాకా క్షీణించవచ్చని అభిప్రాయపడటం గమనార్హం. ‘2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు: భారత్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ 2.0 ప్రభావమెంత?’ అన్న శీర్షికతో ఈ రిపోర్టు వచ్చింది.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠమెక్కితే భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చని ఎస్బీఐ విశ్లేషిస్తున్నది. ముందుగా దేశానికి ఎదురయ్యే సవాళ్ల విషయానికొస్తే.. అమెరికాకు భారత్ నుంచి వెళ్లే ఎగుమతులపై టారీఫ్‌లు పెరగవచ్చని, హెచ్-1బీ వీసాలపై కొత్తగా ఆంక్షలు రావచ్చని, ఫారెక్స్ మార్కెట్లో ఒడిదొడుకులకు ఆస్కారం ఉండొచ్చని అంటున్నది. ఈ క్రమంలోనే డాలర్ విలువ మరింత బలోపేతమై రూపాయి మారకం విలువ పతనం కావచ్చని అంచనా వేస్తున్నది. ఇందులో భాగంగానే 8-10 శాతం మేర రుపీ నష్టపోవచ్చని హెచ్చరిస్తున్నది. అయితే భారతీయ తయారీ రంగానికి ప్రోత్సాహకాలు లభించవచ్చని, కొత్త మార్కెట్లకు ఎగుమతులు విస్తరించే వీలుందని, ఆర్థిక స్వావలంబన పెరగవచ్చని కూడా చెప్తున్నది.
అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైనప్పుడూ రూపాయి విలువ దారుణంగా దెబ్బతిన్నదని ఎస్బీఐ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు ముందు అధికారంలో ఉన్న ట్రంప్ హయాం లో డాలర్‌తో రుపీ మారకపు రేటు 11 శాతం పతనమైందని చెప్పింది. అయితే జో బైడెన్ హయాంలో కంటే ఇది తక్కువేనని కూడా పేర్కొన్నది. హెచ్-1బీ వీసాల నిబంధనల్ని కఠినతరం చేస్తే ఐటీ, దాని అనుబంధ రంగాల సంస్థలపై ఖర్చుల భారం పెరుగుతుందని కూడా చెప్తున్నది. దీనివల్ల అమెరికా కార్యకలాపాల కోసం ఇక్కడివారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేకపోవచ్చని, దేశీయ నియామకాలపై ఇది ప్రభావం చూపవచ్చని కూడా విశ్లేషించింది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒక పైస దిగజారి సోమవారం మునుపెన్నడూ లేనివిధంగా 84.38 వద్దకు పడిపోయింది. దీంతో డాలర్ ఇండెక్స్‌లో భారతీయ కరెన్సీ మెరుగుపడుతున్నా, దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు తగ్గుతున్నా.. రుపీ ఇంకా ఒత్తిడిలోనే ఉందని తాజా సరళిని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పరిస్థితులు ఇలాగే ఉంటే దేశీయ దిగుమతులు భారమవుతాయని, ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరిగి ప్రెటో ఉత్పత్తుల రేట్లు ఎగిసిపడుతాయన్న ఆందోళనలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం ఇంకా భగ్గుమంటుందని, రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలు మరింత ఆలస్యం కావచ్చన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. దాంతో అన్ని రంగాల్లో వృద్ధిరేటు మందగిస్తుందన్న భయాలు కనిపిస్తున్నాయి.