Rupee Alltime Low | కరోనా మహమ్మారి.. అంతకుముందు ఆర్థిక మందగమనం.. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దరిమిలా మన కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు ఆల్‌టైం రికార్డుల దిశగా పతనం అవుతున్నది. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి 79.72 వద్ద ప్రారంభమై 79.71కి చేరుకుంది. తిరిగి 79.92 పాయింట్ల ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నది.
బుధవారం ట్రేడింగ్‌తో పోలిస్తే గురువారం ట్రేడింగ్‌లో తొమ్మిది పైసలు నష్టపోయి.. మార్కెట్ ముగిసే సమయానికి 79.90 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం దీనికి కారణం అని విశ్లేషకులు అంటున్నారు.
బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌పై 2.20 శాతం తగ్గి 97.38 డాలర్లకు పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ 98 పాయింట్లు నష్టపోయి 53,416.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 28 పాయింట్ల పతనంతో 15,938.65 పాయింట్ల వద్ద స్థిర పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,839.52 కోట్ల విలువైన నిధులు ఉపసంహరించుకున్నారు.