ముంబై, జనవరి 23: ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం మళ్లీ చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజారింది. మునుపెన్నడూ లేనివిధంగా 91.90 వద్ద నిలిచింది. గురువారం ముగింపుతో చూస్తే 32 పైసలు క్షీణించింది. నాడు 91.58 వద్ద ఆగింది. ఇక ఒకానొక దశలోనైతే తొలిసారి 92 మార్కును తాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో మదుపరులు అప్రమత్తతతో వ్యవహరిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ఫారిన్ ఫండ్స్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ నెలకొనడం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నిజానికి ఉదయం ట్రేడింగ్‌లో 91.41 స్థాయికి చేరి కాస్త కోలుకుంటున్నట్టే కనిపించింది. అయితే తిరిగి 92 స్థాయికి దిగింది. చివరకు 91.90 వద్ద ముగిసిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. దీంతో ఈ నెల 21న నమోదైన ముగింపు కనిష్ఠం 91.65, ఇంట్రా-డే కనిష్ఠం 91.74 రికార్డులు రెండూ తుడిచిపెట్టుకుపోయాయి.
డేంజర్లో దేశ ఎకానమీ
కరెన్సీ మార్కెట్లో రూపాయి నష్టాలు.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్తున్నాయని ఇప్పుడు మెజారిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపీ విలువ పడిపోయినకొద్దీ.. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతయ్యే ప్రతి వస్తూత్పత్తి, ముడి సరుకు విలువ పెరుగుతుందని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలు 80 శాతం ముడి చమురు దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో రూపాయి విలువ పెట్రో ధరలకు రెక్కలు తొడుగుతుందని పేర్కొంటున్నారు. పెరిగే పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల ధరలు.. మార్కెట్లో ద్రవ్యోల్బణం విజృంభణకు దారితీస్తాయని చెప్తున్నారు. ఇదే జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల (రెపోరేటు)ను పెంచుతుందని, దీంతో రుణ లభ్యత కరువై ఆయా రంగాల్లో వృద్ధి పడిపోగలదని వివరిస్తున్నారు. ఇది యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థను కుంటుబడేలా చేస్తుందని, ఉద్యోగావకాశాలనూ ప్రభావితం చేయగలదని ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ విద్య భారం
ఏటా భారత్ నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా తదితర దేశాలకు వెళ్లేవారు వేలు, లక్షల్లో ఉంటారు. అయితే ఇప్పుడు వీరందరికీ రూపాయి సెగ గట్టిగానే తగులుతున్నది. పడిపోతున్న రూపీ మారకం విలువ.. విదేశీ విద్యను ఇంకా భారం చేస్తున్నది మరి. పిల్లల ఫీజులు, ఇతర అవసరాలకు నగదును పంపించే తల్లిదండ్రులకు ఇది నిజంగా గడ్డు పరిస్థితే. క్షీణిస్తున్న దేశ కరెన్సీ విలువ.. మరింతగా ఇక్కడి నుంచి అక్కడికి నగదు పంపించాల్సిన దుస్థితిని తీసుకొస్తున్నది. ఆయా దేశాల్లో కూడు, గూడు, బట్ట, చదువులకయ్యే ఖర్చులు గతంతో పోల్చితే పెరగకున్నా.. కేవలం రూపాయి విలువ తగ్గుతున్న కారణంతో అదనంగా సొమ్మును అందజేయాల్సి వస్తున్నది. ఇది విదేశాల్లో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల కుటుంబాలను ఆర్థికంగా మరింత కుంగదీయగలదని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కోణంలో ఆదుకునే చర్యలు తీసుకుంటే బాగుంటుందని వారంతా సూచిస్తున్నారు.
3 వారాల్లో 2 రూపాయలు..
రూపాయి మారకం విలువ రోజురోజుకూ దారుణంగా పడిపోతున్నది. ఈ క్రమంలోనే ఈ నెలలో ఇప్పటిదాకా ఏకంగా 2 రూపాయలకుపైగానే క్షీణించింది. గత ఏడాది డిసెంబర్ 31న డాలర్‌తో పోల్చితే రూపీ వాల్యూ 89.88 వద్ద ముగిసింది. శుక్రవారం ఇది 91.90 దగ్గర నిలిచింది. దీంతో గడిచిన 3 వారాల్లో 2.02 రూపాయలు దిగజారినైట్టెంది. కాగా, 2025 మొత్తంగా రూపాయి విలువ 4.24 రూపాయలు పతనమైంది. దీంతో ఈ భీకర నష్టాలు ఇప్పుడు గుబులు పుట్టిస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది రూపాయి మారకం విలువ సెంచరీ (100) కొట్టడం ఖాయమేనన్న అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి మరి.
రూపీ క్షీణతకు కారణాలు
విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) నుంచి అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులను మదుపరులు రిస్క్‌గా భావిస్తుండటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఇంకా నష్టపోగలదనే మేము భావిస్తున్నాం. వ్యక్తులు, వ్యాపారులు, ఆర్థిక సంస్థల వంటి హెడ్జర్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు మరింతగా పెరిగే డిమాండ్ రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందనే అనుకుంటున్నాం.
-అనుజ్ చౌధరి, రిసెర్చ్ అనలిస్ట్