Rupee | ముంబై, మార్చి 10: రూపాయికి మరిన్ని చిల్లులుపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, టారిఫ్ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతోపాటు విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోతుండటంతో దేశీయ కరెన్సీ విలువ సోమవారం ఒకేరోజు 36 పైసలు పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వారం కనిష్ఠ స్థాయి 87.31కి జారుకున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు పతనం చెందడంతో కరెన్సీ మార్కెట్లో సెంటిమెంట్‌ను నిరాశపరిచిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 87.24 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 87.36 కనిష్ఠ స్థాయిని తాకింది.
చివరకు 36 పైసలు నష్టపోయి 87.31 వద్ద స్థిరపడింది. గత నెల 25న రూపాయి ఒకేరోజు 47 పైసలు నష్టపోయిన విషయం తెలిసిందే. దీనితర్వాత ఈరోజు అత్యధికంగా పడిపోయింది. డాలర్‌తో పాటు మిగతా ఆరు కరెన్సీలు కూడా పతనం చెందాయి. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంటాయిల్ స్వల్పంగా పెరిగి 70.56 డాలర్లు పలుకగా, సెన్సెక్స్ 217.41 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ)లు రూ.485.41 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఇండస్ట్రియల్స్, చమురు అండ్ గ్యాస్ రంగ షేర్లలో చివరి గంటలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడం సూచీలు నష్టాల్లోకి జారుకోవడానికి ప్రధాన కారణం. వరుసగా ఎనిమిది సెషన్లుగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ సోమవారం 217.41 పాయింట్లు పతనం చెంది 74,115.17 వద్ద స్థిరపడింది.
ప్రారంభంలో 74,741 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ ఇంట్రాడేలో 74,022.24 పాయింట్లకు పడిపోయింది. మరో సూచీ నిఫ్టీ సైతం 92.20 పాయింట్లు కోల్పోయి 22,460.30 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరులు రూ.4 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.4,43,269.25 కోట్లు కరిగిపోయి రూ.3,93,85,818.73 కోట్లు(4.51 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది.