న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను (Rs 2000 notes) రెండేళ్ల కిందట ఉపసంహరించింది. అయినప్పటికీ రూ.6,266 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇంకా చెలామణిలో ఉన్నాయి. 2023 మే 19న రూ.2000 నోట్లు వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆ ప్రకటన నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే 2025 ఏప్రిల్ 30 నాటికి ఇంకా రూ. 6,266 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నట్లు వెల్లడించింది.
కాగా, 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లలో 98.24 శాతం తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. అలాగే ఈ నోట్లను అన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకునేందుకు 2023 అక్టోబర్ 7 వరకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది.
మరోవైపు 2023 అక్టోబర్ 9 నుంచి 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2,000 నోట్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. వ్యక్తులు, సంస్థలు తమ బ్యాంకు ఖాతాల్లో ఈ నోట్లను జమ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్బీఐ జారీ చేసిన ఏ కార్యాలయానికైనా పోస్ట్ ద్వారా రూ.2000 నోట్లను పంపవచ్చని స్పష్టం చేసింది.