Royal Enfield | ప్రముఖ లగ్జరీ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ మార్కెట్లో దూసుకు పోతున్నది. గతేడాదితో పోలిస్తే మోటారు సైకిళ్ల విక్రయాల్లో 26 శాతం గ్రోత్ సాధించింది. 2022 జూన్లో 61,407 బైక్స్ అమ్ముడు పోతే, గత నెలలో 77,109 యూనిట్లు విక్రయించింది.
దేశీయ విక్రయాల్లో 34 శాతం విక్రయాలు పెరిగాయి. ఏడాది క్రితం (2022 జూన్) 50,265 మోటారు సైకిళ్లు విక్రయించిన రాయల్ ఎన్ఫీల్డ్.. ఈ ఏడాది 67,495 యూనిట్లు విక్రయించింది. కానీ విదేశాలకు ఎగుమతులు మాత్రం తగ్గిపోయాయి. 2022 జూన్లో 11,142 బైక్స్ ఎగుమతి చేస్తే, గత నెలలో 9614 యూనిట్లతోనే సరిపెట్టుకున్నది.
ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన మోటారు సైకిళ్లతో తాము దేశీయంగా, గ్లోబల్ మార్కెట్లలో మంచి సేల్స్ నమోదు చేశామని రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బీ గోవింద రాజన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ మోటారు సైకిళ్లు.. బైక్స్ ప్రేమికులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.