Royal Enfiled E-20 Bike | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ.. రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లంటే.. పాత కాలంలో పెద్దల నుంచి పిల్లల వరకూ ఎంతో మోజు.. ఇప్పటి వరకూ సంప్రదాయ పద్దతుల్లో బైక్‌లు ఆవిష్కరించిన రాయల్ ఎన్ఫీల్డ్.. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా అధునాతన టెక్నాలజీతో సరికొత్త మోటారు సైకిళ్లు తెస్తున్నది. ఇటీవలే బుల్లెట్ 350 ఆవిష్కరించిన రాయల్ ఎన్ఫీల్డ్.. తాజాగా ఫ్లెక్స్ ఫ్యుయల్ మోటారు సైకిళ్ల ఆవిష్కరణకూ ‘సై’ అంటోంది. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్.. వచ్చే త్రైమాసికంలో ఫ్లెక్స్ ఫ్యుయల్ మోటార్ సైకిల్ ఆవిష్కరించనున్నది.
రాయల్ ఎన్ఫీల్డ్ పాపులర్, బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిళ్లలో ‘క్లాసిక్-350’ బైక్‌ని ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌గా ఆధునీకరించనున్నట్లు తెలుస్తున్నది. న్యూ-జే- ప్లాట్‌ఫామ్ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్న క్లాసిక్-350 బైక్.. ఫ్లెక్స్ ఫ్యుయల్కు సపోర్టివ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. క్లాసిక్ 350 బైక్‌తోపాటు మీటర్ 350, హంటర్ 350, ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన బుల్లెట్-350 బైక్స్ కూడా జే-ప్లాట్‌ఫామ్ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్నవే.
రాయల్ ఎన్ఫీల్డ్ ఒక్కటే ఫ్లెక్స్ ఫ్యుయల్ మోటారు సైకిళ్లు తయారు చేయడం లేదు. ఇంతకుముందు హోండా మోటారు సైకిల్స్ కూడా భారత్ మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యుయల్ మోటారు సైకిళ్లు ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యుయల్ మోటారు సైకిల్ ఆవిష్కరించిన సంస్థగా టీవీఎస్ మోటార్ కంపెనీ నిలుస్తుంది. ఆ సంస్థ 2019లో అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ100 మోటారు సైకిల్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
ఇథనాల్, పెట్రోల్ మిక్సింగ్నే ఫ్లెక్స్ ఫ్యుయల్ అని అంటారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఆధారిత బైక్‌లు సేల్ అవుతున్నాయి. ఆ లక్ష్యాన్ని 10 నుంచి 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. దీన్నే ఈ-20 ఫ్యుయల్ అని పిలుస్తున్నారు. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన మోటారు సైకిళ్లు.. 20 శాతం బ్లెండెడ్ ఫ్యుయల్కు అనుకూలం కానున్నాయి.