న్యూఢిల్లీ, మే 26 : పెరుగుతున్న ఇంధన ధరలు, బంగారం-వెండిపై అధిక దిగుమతి సుంకాలు.. జూన్‌కల్లా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి ఎగదోసే వీలుందని పలువురు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపు విషయంలో వేచిచూసే ధోరణినే అవలంబించవచ్చని అభిప్రాయపడుతుండటం గమనార్హం. గత నెల ఏప్రిల్‌లో అటు రిటైల్, ఇటు హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు విజృంభించిన నేపథ్యంలో వచ్చే నెల జూన్‌లో జరుగబోయే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును ఆర్బీఐ పెంచే అవకాశాలే ఎక్కువన్న అంచనాలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వడ్డీరేట్లను పెంచడానికి ముందు ఇంధన ధరల పెంపు ప్రభావంలో కొంత స్థిరత్వం ఏర్పడేదాకా పెంపు జోలికి సెంట్రల్ బ్యాంక్ వెళ్లకపోవచ్చనే అభిప్రాయాన్ని ఇప్పుడు మెజారిటీ ఆర్థిక నిపుణులు కనబరుస్తున్నారు. దీంతో జూన్ ద్రవ్య సమీక్షలో వడ్డీరేట్ల పెంపు ఉండదని, ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్) ద్రవ్య సమీక్షల్లోనే వడ్డింపులుంటాయన్న అంచనాలు నెలకొన్నాయి.
ఈ నెల 15 నుంచి 25 మధ్య 11 రోజుల్లో 4సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచేశాయి. తెలంగాణలోనే లీటర్ ధర దాదాపు రూ.8 పెరిగింది. సీఎన్జీ కూడా రూ.4 ఎగిసింది. దీంతో రవాణా ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం అన్ని వస్తూత్పత్తుల ధరలపై పడుతున్నది. అందుకే పండ్లు, కూరగాయల దగ్గర్నుంచి పప్పులు, వంటనూనెలు, ఇతర కిరాణా సరుకులదాకా అన్ని ఆహార పదార్థాల రేట్లు ఎగబాకాయి. ఈ క్రమంలోనే ఈ నెలకుగాను వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4-4.5 శాతానికి, జూన్‌లో 4.5-5 శాతానికి చేరవచ్చని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాత్సవ పీటీఐతో అంటున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు స్టోరేజీ, జనరేటర్ ఆధారిత విద్యుత్తు ఖర్చులనూ ఎగదోస్తున్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా, జూన్ 12న మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు రానున్నాయి. ఏప్రిల్‌లో 3.48 శాతంగా నమోదైన సంగతి విదితమే. ఇక టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 42 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 8.3 శాతంగా ఉన్నది. అయితే ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే ద్రవ్య సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం విదితమే.
పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం.. మార్కెట్‌పై పూర్తిగా జూన్ లేదా జూలై నుంచి కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పాత స్టాక్ ఉంటుంది కాబట్టి వాటి ధరల్లో మార్పు కనిపించట్లేదని, కొత్త స్టాక్ వస్తే పెరిగిన రవాణా ఖర్చులు, ఇతర ఉత్పాదక వ్యయాన్ని జోడించి నూతన ధరల ముద్రణ ఉంటుందని వివరిస్తున్నారు. ము ఖ్యంగా వంటనూనెలు, ఇతర ఆయిల్స్, సబ్బుల ధరలు పెరిగే వీలుందని చెప్తున్నారు. అంతేగాక వివిధ ఆహార పదార్థాల ధరలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ రేట్లు పెరుగుతాయని పేర్కొంటున్నారు. నిజానికి ఏప్రిల్‌లో ఆర్బీఐ ద్రవ్య సమీక్ష సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 85 డాలర్లుగా ఉన్నది. ఇప్పుడు అది 10-15 డాలర్లు ఎక్కువగా కదలాడుతున్నది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ముదిరితే అటు గ్లోబల్ మార్కెట్లో, ఇటు దేశీయ మార్కెట్లో క్రూడాయిల్, ఇంధన రేట్లు భగ్గుమనడం ఖాయం. దీంతో జూన్ మొదటి వారంలో నమోదయ్యే ముడి చమురు ధరలూ కీలకమేనన్న అభిప్రాయాలున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరి 28న మొదలవగా.. 3 నెలలు కావస్తున్నా ఆ ఉద్రిక్తతలు సద్దుమణగడం లేదు. అమెరికాకు అండగా ఉంటున్నాయని యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ తదితర గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నది. దీంతో చమురు, సహజ వాయువు ఉత్పత్తి పడిపోయింది. పైగా హొర్ముజ్ జలసంధిలో రవాణాను కూడా ఇరాన్ అడ్డుకుంటున్నది. ఫలితంగా భారత్‌కు క్రూడ్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇంధన ధరల పెంపు ప్రభావాన్ని ఆర్బీఐ కనీసం మూడు నెలలపాటైనా పరిశీలించవచ్చు. అప్పటిదాకా వడ్డీరేట్ల పెంపు ఉండదనే అనుకోవచ్చు. అయితే ఒకవేళ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 5 శాతాన్ని దాటి నమోదైతే మాత్రం వడ్డీరేట్ల పెంపునకు సెంట్రల్ బ్యాంక్ ఉపక్రమిస్తుంది.
జూన్ నెలలో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతాన్ని దాటి నమోదు కావచ్చు. అయితే ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ పెట్టుకున్న గరిష్ఠ పరిమితి 6 శాతంలోపే ఇది ఉంటుంది కాబట్టి జూన్ 5న జరిగే ద్రవ్య సమీక్షలో వడ్డీరేట్లను సెంట్రల్ బ్యాంక్ యథాతథంగానే ఉంచే అవకాశాలున్నాయి.
2026-27లో దేశంలో ద్రవ్యోల్బణ సగటు 5.1 శాతంగా నమోదయ్యే వీలున్నది. ఇక జూన్ ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచుతుందా? తగ్గిస్తుందా? అన్నదానిపై మేము అంచనా వేయలేము. అయితే జూలై-మార్చిలో వడ్డీరేట్ల పెంపులు మాత్రం తప్పవు.
జూన్ ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చని మేము విశ్వసిస్తున్నాం. ఇంధన ధరల ప్రభావం రవాణాపై, ముడి సరుకులపై, అన్ని రకాల ఉత్పత్తులపై మార్కెట్లో పూర్తిగా కనిపించేది అక్టోబర్-మార్చిలోనే. అప్పటిదాకా కొత్త స్టాక్ రాదుమరి. కాబట్టి అప్పుడు ద్రవ్యోల్బణం గణాంకాలు ఎక్కువగా నమోదయ్యే వీలున్నది.