Credit Card-UPI Payments | కరోనా మహమ్మారి పుణ్యమా? అని ఏ వస్తువు కొన్నా ఫోన్‌పే, గూగుల్ పే.. పేటీఎం యాప్స్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్తో డబ్బు చెల్లిస్తున్నారు ప్రజలు. దీంతోపాటు పెరిగిన ధరల ప్రభావాన్ని తగ్గించుకోవడానికీ క్రెడిట్ కార్డుల వాడకం పెంచేశారు. ఫలితంగా ప్రజల్లో వినియోగ సామర్థ్యం పెరిగిందని నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక రంగం గాడిన పడిందనడానికి ఇదే సంకేతం అని చెబుతున్నారు.
ఏప్రిల్‌లో యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు రూ.9.83 కోట్లు జరిగితే ఆగస్టులో అది రూ.10.73 లక్షల కోట్లకు పెరిగాయి. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టర్మినల్స్ వద్ద క్రెడిట్ కార్డ్ వినియోగం ఏప్రిల్‌లో రూ.29,988 కోట్ల మేర లావాదేవీలు చోటు చేసుకున్నాయి. గత నెలలో క్రెడిట్ కార్డ్‌ల వినియోగం రూ.32,383 కోట్లకు చేరింది. ఇక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్పైన క్రెడిట్ కార్డు వాడకం ఏప్రిల్‌లో రూ.51,375 కోట్లు జరిగితే.. ఆగస్టులో అది రూ.55,264 కోట్లకు దూసుకెళ్లింది.
2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో ఏడాది ప్రాతిపదికన క్రెడిట్ కార్డుల వాడకం 16 శాతం పెరిగిందని ఆర్బీఐ డేటా చెబుతున్నదని ఎస్బీఐ కార్డ్ ఎండీ కం సీఈవో రామమోహనరావు అమర చెప్పారు. క్రెడిట్ కార్డులు తీసుకోవడంతోపాటు వాడకం పెరిగినట్లే, నగదు వినియోగంపైనా పెరిగిందని ఎస్బీఐ కార్డ్ ఎండీ కం సీఈవో రామమోహన రావు చెప్పారు. గత కొన్ని నెలలుగా ప్రతి నెలలోనూ క్రెడిట్ కార్డుల వినియోగం రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుత పండుగల సీజన్లో అది మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.