SBI Right Off | న్యూఢిల్లీ, మే 28 : ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకుల కన్నా ప్రైవేట్ రంగ బ్యాంకులు అన్ సెక్యూర్డ్ రుణాలను పెద్దమొత్తంలో రైటాఫ్ చేశాయి. వీటిలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అత్యధికంగా రూ.26 వేల కోట్లకు పైగా రుణాలను తన బ్యాలెన్స్ షీట్స్ నుంచి తీసివేసింది.
అంతక్రితం ఏడాది రైటాఫ్ చేసిన రూ.17,645 కోట్లతో పోలిస్తే ఇంచుమించు రూ.10 వేల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలను రైటాఫ్ చేయడం విశేషం. గతేడాది ఐసీఐసీఐ బ్యాంక్ రూ.9,271 కోట్ల రుణాలను తన ఖాతా పుస్తకం నుంచి తొలగించింది. 2023-24లో రైటాఫ్ చేసిన రూ.6,091 కోట్ల కంటే ఇది 50 శాతం అధికం. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా రూ.11,833 కోట్ల మొండి బకాయిలను తన ఖాతాలోంచి తీసివేసింది.
చిన్నస్థాయి రుణాలు తీసుకొని ఎగ్గొట్టే వారు అధికంగా ఉంటున్నారని రిజర్వుబ్యాంక్ ఆందోళన వ్యక్తంచేసింది. వీటిలో ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాల్లో అత్యధికంగా ఉంటున్నాయని, వీటిని తగ్గించడానికి బ్యాంకులు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని హెచ్చరిస్తున్నది. పూచీకత్తు లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నాయని, వీటి వల్ల ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులపై ప్రతికూల ప్రభావం పడనున్నదని గతంలోనే రిజర్వు బ్యాంక్ హెచ్చరించింది. అయినప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడం మానడం లేదు. కఠిన నిబంధనలు విధించడం వల్ల బ్యాంకుల రుణ వితరణకు బ్రేక్లు వేయవచ్చునని, దీనివల్ల చిన్న వ్యాపారాలు, వ్యక్తులు, రుణాలు పొందడం కష్టతరంకానున్నది. అయినప్పటికీ గడిచిన మూడేండ్లలో రైటాఫ్ అయిన రుణాల్లో 20 శాతం రికవరి కావడం విశేషం.