Reliance Bid for Sintex | అది దివాలా తీసిన సంస్థ.. గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ సంస్థ పేరు సింటెక్స్ టెక్స్టైల్. నష్టాలు, రుణ బకాయిలతో సమస్యల సుడి గుండంలో చిక్కుకున్నది. ఈ కంపెనీని టేకోవర్ చేయడానికి ఆసియా కుబేరుడు.. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బిడ్ దాఖలు చేసింది. మరో మూడు సంస్థలతో పోటీ పడుతున్నది. దివాలా తీసిన సంస్థ కోసం ముకేశ్ అంబానీ పోటీ పడటం ఇది రెండోసారి. ఇంతకుముందు దివాలాతీసిన అలోక్ ఇండస్ట్రీస్‌ను రిలయన్స్ కైవశం చేసుకున్నది. నష్టాలతో పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుని దివాలా ప్రకటించిన సింటెక్స్ కోసం ఇతర సంస్థలతోపాటు రిలయన్స్ ఎందుకు పోటీ పడుతోంది. అసలు సింటెక్స్ కంపెనీ లావాదేవీలేమిటో ఓ లుక్కేద్దాం..
గుజరాత్‌లోని కలోల్ కేంద్రంగా టెక్స్టైల్ రంగంలో పారిశ్రామిక కార్యకలాపాలతో సింటెక్స్ ప్రయాణం ప్రారంభమైంది. ఇంటి నిర్మాణానికి ఒక్కో ఇటుక పేర్చినట్లు అమెరికాతో సహా పలు దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించింది.. కానీ కాలం కలిసి రాలేదు.. క్రమంగా నష్టాల్లో కూరుకుపోయింది.. సమస్యల్లో చిక్కుకుంది. తత్ఫలితంగా గత ఏప్రిల్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్-అహ్మదాబాద్ బెంచ్ ముందు దివాలా తీసినట్లు ప్రకటించింది.
ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, బీకే గోయెంకా ఆధ్వర్యంలోని వెల్స్పన్, సంజయ్ దాల్మియా జీహెచ్‌సీఎల్, దినేశ్ కుమార్ సారధ్య సంస్థ హిమాత్సింగ్కా కూడా సింటెక్స్ సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్లు అర్మానీ, బర్బెర్రీ తదితర నేత బట్టలకు పెట్టింది పేరు సింటెక్స్.
అసెట్ బయ్యర్ అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి రిలయన్స్ బిడ్ దాఖలు చేసింది. ఇక బీకే గోయెంకా ఆధ్వర్యంలోని వెల్స్పన్.. ఈజీగో టెక్స్‌టైల్స్‌తో కలిసి టెండర్ వేసింది. సింటెక్స్ను దక్కించుకోగలిగితే వెల్ప్సన్ ఇంటిగ్రేషన్ వ్యూహాల అమలుకు ఉపకరిస్తుందని అంచనా. అసలు దివాళా ప్రక్రియ ప్రారంభించడానికి ముందు సింటెక్స్ రుణ దాతలకు వెల్ప్సన్ రూ.2000 కోట్ల లోపు చెల్లించడానికి ముందుకు వచ్చింది. కానీ రుణ దాతలైన బ్యాంకింగ్, ఆర్థికేతర సంస్థలకు వెల్ప్సన్ ప్రతిపాదన నచ్చలేదు. ఇంతకుముందు కూడా దివాలా తీసిన సంస్థల టేకోవర్ కోసం దాఖలు చేసిన బిడ్లేవీ సక్సెస్ కాలేదు.
సింటెక్స్ రూ.8000 కోట్ల మేరకు బ్యాంకులు, ఇతర సంస్థలకు రుణ బకాయిలు పడింది. 1931లో రూ.594 కోట్లతో సింటెక్స్ ప్రారంభమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1696 కోట్ల విక్రయాలు జరుగగా, రూ.1306 కోట్ల నష్టం వాటిల్లిందని చూపింది. ఇదిలా ఉంటే బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దినేశ్ కుమార్ హిమాత్సింగ్కా వ్యక్తిగత హోదాలో తన తనయుడు శ్రీకాంత్, హిమాత్సింగ్కా వెంచర్స్ ద్వారా బిడ్ దాఖలు చేశారు. 2019 సెప్టెంబర్‌లో నాన్-కన్వర్టిబుల్ బాండ్లపై వడ్డీ, అసలు రూ.15 కోట్ల పై చిలుకు చెల్లించడంలో విఫలమైనందుకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ శాఖలో ఇన్వెస్కో అసెట్మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 6న సింటెక్స్ దివాలా ప్రక్రియ ప్రారంభించడానికి అంగీకరించింది.