ఈరోజు- మార్చి 19- ప్రపంచ నిద్ర దినోత్సవం. నిజానికి ప్రతిరోజూ నిద్రోత్సవమే కావాలి. నిద్రకు ఒక దినం పెట్టాల్సివచ్చిందంటే నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తుందనే అనుకోవాలి. కొన్ని సెకండ్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడటానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు.
కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు నిద్రకోసం పరితపిస్తారు. నిద్రకు వేళాయెరా! అని తమను తాము జోకొట్టుకుంటూ సంగీతం వింటూ రాత్రంతా నిర్ణిద్ర గీతాలు విని తరిస్తూ ఉంటారు. నిద్ర కొందరికి మాత్రల్లో దొరుకుతుంది. కొందరికి మద్యంలో దొరుకుతుంది. కొందరికి ఏసీల్లో దొరుకుతుంది. తమకు నిద్ర ఎందుకు పట్టడంలేదని కొందరు నిద్రపోతున్నవారిని తట్టి లేపి నిలదీస్తుంటారు. నిద్రలేమి ఒక జబ్బు అని కొందరి భయం. నిద్రలేమి ఒక మానసిక సమస్య అని కొందరి ఆందోళన.
సర్వంసహా చక్రవర్తి హంసతూలికా తల్పం మీద పడుకున్న నిద్ర; పక్కనే కటికనేల మీద ఆయన బంటు పడుకున్న నిద్ర రెండూ ఒకటే అన్నాడు అన్నమయ్య.
‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది’ అని శాస్త్రీయ నిరూపణను పాటలో బంధించి జోలపాడాడు ఆత్రేయ.
నిజానికి నిద్ర విశ్రాంతి స్థితి. మెదడు, శరీరం బలం కూడగట్టుకోవడానికి అనువయిన సమయం. ప్రతి ఉదయం నూతనోత్సాహంతో పరుగులు పెట్టడానికి నిద్ర పెట్టుబడి. ఉత్ప్రేరకం. జీర్ణక్రియకు, ఆరోగ్యానికి అత్యవసరం.
రాత్రి ఉద్యోగాలు, రాత్రి రాచకార్యాలు, అర్ధరాత్రి దాటినా టీవీ, స్మార్ట్ఫోన్లు చూస్తుండటాలు.. ఇలా కారణమేదయినా నైట్లైఫ్ను ఎంజాయ్ చేయడమన్నది ఇప్పుడు దానికదిగా ఒక ఆనందం. ఒక నవీన సంస్కృతి. పగటి నిద్ర పనికి చేటు. రాత్రి మేల్కొలుపు ఒంటికి చేటు. గూట్లో దీపం; నోట్లో ముద్ద; కంటికి కునుకు- ఒకప్పటి సామెత. చుక్కలు పొడిచేవేళకు ఆదమరచి నిద్రపోవాలి. సూర్యుడు పొడవకముందే నిద్రలేవాలి.
ఆకలి రుచి ఎరుగదు- నిద్ర సుఖమెరుగదు. అలసిన శరీరం హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. మనసులో వేన వేల ఆందోళనలు, భయాలు, బాధలు, ఆలోచనలు ఎగసి ఎగసి పడుతుంటే నిద్ర రమ్మన్నా రాదు. జీవితం ఎప్పుడూ యుద్ధమే. గెలిచినా, ఓడినా యుద్ధం ఆగదు. దైనందిన జీవితంలో ఏ రోజుకారోజు పోరాటమే. ఈ పోరాటానికి తగిన శక్తిని కూడగట్టి ఇచ్చేది నిద్ర ఒక్కటే. నిద్ర ఎక్కువయితే నిద్ర మొహం. తక్కువయితే నిద్రకు మొహం వాచిన ముఖం.
నిదురించే తోటలోకే పాటలు వస్తాయి. వచ్చి కొమ్మల్లో రెమ్మల్లో పూలను పూయిస్తాయి. కళలకు రంగులద్దుతాయి. కలల గాలులకు గంధం పూస్తాయి.
సడిసేయకో గాలి!
సడిసేయబోకే!
బడలి పుడమి ఒడిలో జగతి నిదురించేనే!