హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): దావోస్ వేదికగా లోకల్ కంపెనీలతో గ్లోబల్ కలరింగ్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు ఆర్భాటంగా పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడా ఇక్కడివారి నేతృత్వంలోని కంపెనీలతోనే అవగాహనా ఒప్పందా (ఎంవోయూ)లు కుదుర్చుకుంటున్నారు మరి.
తెలంగాణలో రూ.6వేల కోట్ల పెట్టుబడులతో ఓ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్) ఆధారిత క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు అభివృద్ధికి ఆసక్తి కనబర్చిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ కంపెనీ వెనుక ఉన్నవారు తెలుగువారే కావడం గమనార్హం. స్లోవేకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌజ్ ఎన్విరో జాయింట్ వెంచరే ఈ న్యూక్లర్ ప్రొడక్ట్స్. ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ సీఈవో, డైరెక్టర్ అనిల్ కుమార్ భవిశెట్టి అవగా, గ్రీన్ హౌజ్ ఎన్విరో సీఈవో, డైరెక్టర్గా మొలుగు శ్రీపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే మరికొన్ని సంస్థలూ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నాయి.