న్యూఢిల్లీ, మార్చి 31: సోమవారం (మార్చి 31)తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో మదుపరులకు చిన్న షేర్లు పెద్ద లాభాలనే పంచిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు పరుగులు పెట్టాయి మరి. రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులకు దిగడంతో చిన్న, మధ్యశ్రేణి స్టాక్స్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 3,471.79 పాయింట్లు లేదా 8 శాతం పుంజుకున్నది. మిడ్‌క్యాప్ సూచీ సైతం 2,209 పాయింట్లు లేదా 5.61 శాతం ఎగిసింది. ఇదే సమయంలో బీఎస్ఈ లార్జ్‌క్యాప్ సూచీ సెన్సెక్స్ మాత్రం 5.10 శాతం మేరకే పెరిగింది. గడిచిన ఏడాది కాలంలో 3,763.57 పాయింట్లు అందిపుచ్చుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
ఆఖర్లో ఉత్సాహంగా..
మార్చి నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. అంతకుముందు వరుసగా 5 నెలల (అక్టోబర్-ఫిబ్రవరి)పాటు సూచీలు పతనమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి నెల ఇన్వెస్టర్లు సెల్లింగ్ ప్రెషర్ నుంచి బయ్యింగ్ మోడ్‌లోకి రావడం మార్కెట్ సెంటిమెంట్‌ను ఎంతగానో పెంచిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఒక్క నెలలోనే సెన్సెక్స్ 4,216.82 పాయింట్లు లేదా 5.76 శాతం పెరగడం గమనార్హం. అలాగే స్మాల్‌క్యాప్ 3,555.23 పాయింట్లు లేదా 8.25 శాతం, మిడ్‌క్యాప్ 2,939.10 పాయింట్లు లేదా 7.61 శాతం ఎగబాకాయి. ఫలితంగా అప్పటిదాకా వాటిల్లిన నష్టాలు కనుమరుగైపోయాయి. నిజానికి విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణలకు దిగుతున్నా.. దేశీయ సంస్థాగత మదుపరుల (డీఐఐ)తోపాటు, రిటైల్ ఇన్వెస్టర్లు అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈక్విటీలు ఆకర్షణీయ ప్రదర్శననే కనబర్చగలిగాయి. అయితే మార్చి ద్వితీయార్ధంలో ఎఫ్ఐఐలు కూడా తిరిగి పెట్టుబడులపట్ల ఆసక్తి కనబర్చడం, ఈక్విటీల్లోకి నిధుల వరదను పారించడం కూడా కలిసొచ్చిందని నిపుణులు మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు.
ఆల్‌టైమ్ హైలో..
2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలన్నీ ఆల్‌టైమ్ హై రికార్డులను నమోదు చేశాయి. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ సెన్సెక్స్ నిరుడు సెప్టెంబర్ 27న మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 85, 978.25 పాయింట్లను తాకింది. ఇక సెప్టెంబర్ 24న మిడ్‌క్యాప్ సూచీ 49,701. 15 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకున్నది. డిసెంబర్ 12న స్మాల్‌క్యాప్ సూచీ 57,827.69 పాయింట్లను చేరింది. ఇక బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో గత ఏడాది సెప్టెంబర్‌లోనే రూ.478 లక్షల కోట్లకు వెళ్లింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రావడం, పరస్పర సుంకాల హెచ్చరికలు చేయడం.. భారత్‌సహా ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. దీంతో తర్వాతి రోజుల్లో పరుగులకు బ్రేక్ పడ్డైట్టెంది. కాగా, 2023-24లో బీఎస్ఈ సెన్సెక్స్ 14,659. 83 పాయింట్లు లేదా 24.85 శాతం, మిడ్‌క్యాప్ 15,013.95 పాయింట్లు లేదా 62.38 శాతం, స్మాల్‌క్యాప్ 16,068.99 పాయింట్లు లేదా 59.60 శాతం పెరిగాయి.