న్యూఢిల్లీ, జూన్ 12 : ఈసారి మండుటెండల్లో వడదెబ్బ సంగతేమోగానీ.. ధరదెబ్బ మాత్రం అందరికీ గట్టిగానే తగిలింది. కొనుగోలుదారుల జేబుల్ని గుల్ల చేసేలా మేలో రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది మరి. అంతకుముందు నెలతో పోల్చితే గత నెలలో దాదాపు 50 బేసిస్ పాయింట్లు ఎగిసి 3.93 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో 3.48 శాతంగానే ఉన్న విషయం తెలిసిందే. పెరుగుతున్న పెట్రో ధరలు, ఆహారోత్పత్తుల ధరలే ఇందుకు కారణమని శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దేశీయ మార్కెట్లో మే 15 నుంచి లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు దాదాపు రూ.8 చొప్పున, గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ ధర సుమారు రూ.90 పెరిగిన సంగతి విదితమే. ఈ క్రమంలో పెరిగిన రవాణా ఖర్చులు.. అన్ని వస్తూత్పత్తుల ధరల్ని ఎగదోస్తున్నాయని ఆర్థిక నిపుణులు ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా పెరిగిన ఇంధన ధరలు.. నేరుగా ద్రవ్యోల్బణాన్ని 36 బేసిస్ పాయింట్లు పెంచాయని తేటతెల్లమవుతున్నది.
ఈసారి మే నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతంగా ఉన్నది. ఏప్రిల్‌లో 4.2 శాతంగా నమోదైనట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) చెప్తున్నది. ఈ క్రమంలో ఈసారి వర్షపాతం దేశ ఆర్థిక వ్యవస్థ కదలికల్నే ప్రభావితం చేయగలదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దేశంలో ఎక్కువగా వర్షాధార పంటలేనన్నది తెలిసిందే. దీంతో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురువకపోతే.. సహజంగానే పంట దిగుబడులపై ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇదే జరిగితే ఆహార ద్రవ్యోల్బణం, ఆ సెగతో రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా పెరుగడం ఖాయమే. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ద్రవ్యోల్బణం అంచనాలను పెంచేసింది. 5.1 శాతంగా నమోదు కావచ్చన్నది. వర్షాభావ పరిస్థితులే ఏర్పడితే ఈ స్థాయిని మించి ద్రవ్యోల్బణ గణాంకాలు పరుగులు పెడుతాయని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇక రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 6 శాతాన్ని దాటనీయరాదని ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల సారాంశం. కానీ వాస్తవ పరిస్థితులు.. ఆ టార్గెట్‌ను దాటేసేలా ఉండటం గమనార్హం.
బంగారం, వెండి తదితర విలువైన లోహాల ఆభరణాలతోపాటు టమాట వంటి పలు కూరగాయల ధరలు బాగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో టమాట రేటు రూ.60కిపైగానే పలుకుతున్నది చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఆలుగడ్డ తదితర కూరగాయలు, వాహనాల ధరలు తక్కువగా ఉన్నా.. తుది గణాంకాలపై ప్రభావం చూపలేకపోయాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. కాగా, అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతున్నది. సరుకు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధి మూసివేత కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్ని పెంచేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు, ఇరాన్ తమ పొరుగు దేశాలపై ప్రతిదాడులతో ఇప్పట్లో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేలా లేవు. ఈ నేపథ్యంలో దిగుమతుల ద్వారానే దాదాపు 90 శాతం ఇంధన అవసరాలను తీర్చుకుంటున్న భారత్‌కు మున్ముందు ఇబ్బందులేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరిగే పెట్రో ధరలతో ద్రవ్యోల్బణం రాబోయే నెలల్లో గణనీయంగా పెరిగే సంకేతాలే కనిపిసున్నాయి.
రాష్ట్రంలో అధిక ధరలు.. వినియోగదారుల టాప్ లేపేస్తున్నాయి. జాతీయ ద్రవ్యోల్బణం గణాంకాలకు ఇంచుమించు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్న రాష్ట్ర ద్రవ్యోల్బణం గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత నెల మేలోనూ దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం రికాైర్డెంది. ఏకంగా 6.15 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన ద్రవ్యోల్బణం గణాంకాలే రాష్ర్టాలవారీగా చూసినైట్టెతే టాప్‌లో ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఆహారోత్పత్తుల ధరలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్ తలకిందులైపోతున్నది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు కిలో రూ.80-120 స్థాయిలో ఉన్నాయి మరి. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, ఇతర ఆహారోత్పత్తుల పరిస్థితి ఇలాగే ఉన్నది. దీంతో ధరల అదుపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.