BOB Report | జీఎస్టీ సంస్కరణలు త్వరలోనే అమలులోకి రానున్నాయి. దాంతో చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గనున్నది. ఈ క్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ద్రవ్యోల్బణం (CPI) స్థిరంగా.. లేదంటే తక్కువగా ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం.. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ రేటులో మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం పరోక్ష పన్నులను తగ్గించడం తగ్గించడం వల్ల ఆయా ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకు చేరనున్నాయి. ఇది ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గిస్తుందని నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 3.1శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆగస్టు 2025లో వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారిత ద్రవ్యోల్బణ రేటులో ఉపశమనం ఉందని నివేదిక తెలిపింది. ఆహార వస్తువుల ధరలు నిరంతర తగ్గుదరల కారణంగా.. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 2.1%శాతానికి తగ్గింది.
గత సంవత్సరం అంటే ఆగస్టు 2024లో ఇది ఈ రేటు 3.7శాతంగా నమోదైంది. ఈ సంవత్సరం ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం విషయంలో కొంత ఉపశమనం లభించింది. తాజా డేటా ప్రకారం.. కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, గుడ్ల ధరల్లో తగ్గుదల కనిపించింది. నూనెగింజల ధరలు సైతం కొంత వరకు తగ్గుముఖం పట్టాయి. అయితే, దేశీయ స్థాయిలో వాటి ధరలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. సీజనల్ అడ్జస్ట్మెంట్ బేసిస్ ప్రకారం.. వినియోగదారుల ఆహార ధరల సూచిక (CFPI) ఆగస్టులో నెలవారీగా 0.8శాతం పెరిగింది. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్ హౌస్ ఎకనామిక్ కండిషన్ ఇండెక్స్ ప్రకారం.. సెప్టెంబర్ 2025 తొలి పది రోజుల్లో -0.9శాతంగా ఉండగా.. ఇది ధరలు మరింత తగ్గుతాయని సూచిస్తుంది. వాతావరణ సంబంధిత పరిమితులు ప్రధాన కూరగాయలు టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపల (TOP) సరఫరాను ప్రభావితం చేయలేదని బీవోబీ నివేదిక పేర్కొంది. మరోవైపు, ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని.. బంగారం తప్ప ప్రధాన ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉందని నివేదిక వివరించింది.