Home Loan EMI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెండో ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటును తగ్గించింది. దీంతో ఫ్లోటింగ్ రేటు ఆధారిత రుణాలపై, ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీరేట్లు కూడా తగ్గుతున్నాయి. అయినప్పటికీ రుణగ్రహీతలందరికీ ఈ ఉపశమనం లభించట్లేదు. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్లు తక్కువగా ఉన్నవారికి. రాబోయే ద్రవ్యసమీక్షల్లోనూ కోతలకు వీలుందన్న సంకేతాల నేపథ్యంలో మరి అలాంటివారు ఏం చేయాలి?
ప్రస్తుతం చాలావరకు గృహ రుణాలు ఫ్లోటింగ్ రేటు ఆధారిత లోన్లే. ఇవి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)కు అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా రెపోరేటుకు అన్నమాట. దీంతో ఆర్బీఐ ఈ రెపోరేటును తగ్గిస్తే.. సదరు ఫ్లోటింగ్ రేటు ఆధారిత రుణాలపై వడ్డీరేట్లూ తగ్గుతాయి. ఫలితంగా వారివారి ఈఎంఐ (నెలవారీ కిస్తీలు) భారం కూడా దిగుతుంది. కానీ కొందరికి పూర్తిస్థాయిలో ఈ ప్రయోజనాన్ని రుణదాతలు (బ్యాంకర్లు లేదా ఇతర హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు) ఇవ్వడం లేదు. తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి.. ఎక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారితో పోల్చితే రుణాలపై వడ్డీరేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇది సర్వసాధారణమే. అయితే ఇలా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ తమ రుణాలపై వడ్డీరేట్లను ఎలా తగ్గించుకోవాలి? దానికి ఉన్న మార్గాలను పరిశీలిస్తే..
మెరుగైన క్రెడిట్ స్కోర్
ప్రస్తుతం బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థల్లో రుణాల కోసం వెళ్తే అక్కడ ముందుగా పరిశీలించేది మీ క్రెడిట్ స్కోర్‌నే. తీసుకున్న రుణాలకు సంబంధించి మీరు ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తున్నారా? మీకు ఆర్థిక, రుణ క్రమశిక్షణ ఉందా? అన్నది మీ క్రెడిట్ స్కోర్నుబట్టి రుణదాతలు ఓ నిర్ధారణకు వస్తారు. ఒకవేళ మీరు ఈఎంఐలను సరిగ్గానే చెల్లిస్తుంటే తప్పక మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగానే ఉంటుంది. అలాకాకుండా డిఫాల్ట్ అయితే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కనుక ప్రతీ రుణగ్రహీతకు క్రెడిట్ స్కోర్ కీలకం. దాన్ని కాపాడుకోవాలంటే, మెరుగుపర్చుకోవాలంటే చాలాచాలా క్రమశిక్షణ అవసరం. ఇక 750, ఆపైన మీ క్రెడిట్ స్కోర్ ఉంటే లేదా ఇంతకు తక్కువగా ఉంటే గృహ రుణగ్రహీతలు వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో చూద్దాం.
వడ్డీరేటు పరిశీలన
మీ గృహ రుణ ఖాతాలోకి లాగినై ప్రస్తుతం మీ బ్యాంక్ మీకు వేస్తున్న వడ్డీరేటును చెక్ చేసుకోవాలి. నిజానికి మీ క్రెడిట్ స్కోర్ 750కిపైనే ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ రెపోరేటు తగ్గిస్తే దానిప్రకారం మీ రుణాలపైనా వడ్డీరేటు తగ్గిపోతుంది. కానీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటేనే మీ బ్యాంక్‌తో మీరు ఎప్పటికప్పడు సంప్రదిస్తూ ఉండాలి. ముందుగా ఏం చేయాలంటే..
సంప్రదింపులు
మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవాలి. అనవసరమైన అప్పుల జోలికి వెళ్లకూడదు. సకాలంలో ఈఎంఐలను చెల్లించాలి. వీలైతే మీ దగ్గరున్న నగదుతో అసలు మొత్తాన్ని కొంత తీర్చే ప్రయత్నం చేయండి. పరిమితులకు లోబడే క్రెడిట్ కార్డులను వినియోగించాలి. ఇలా చేస్తూపోతే మీ క్రెడిట్ స్కోర్ త్వరగానే మెరుగవుతుంది. ఆ తర్వాత ఈ-మెయిల్ ద్వారాగానీ బ్యాంక్ శాఖను నేరుగా సందర్శించడంగానీ చేయాలి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ గతంతో పోల్చితే మెరుగైందని, ఆర్బీఐ రెపోరేటు కోతల ప్రకారం మీ రుణంపై వడ్డీరేటును తగ్గించాలని విజ్ఞప్తి చేయాలి. ఒకవేళ ఇందుకు మీ రుణదాత అంగీకరించకపోతే.. రుణాన్ని వేరే బ్యాంక్‌కు లేదా సంస్థకు మార్చుకుంటామని స్పష్టం చేయాలి. సాధారణంగా క్రమశిక్షణ కలిగిన రుణగ్రహీతను వదులుకోవడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా వ్యాపారం కూడా పోతుంది కాబట్టి మీ అభ్యర్థనను మన్నించే అవకాశాలే ఎక్కువ.
గృహ రుణ బదిలీ
వడ్డీరేట్ల తగ్గింపునకు మీ బ్యాంక్ ఒప్పుకోకపోతే మరో బ్యాంక్‌కు వెళ్లడమే ఉత్తమం. అయితే ఏ బ్యాంక్‌లో ఎంతెంత వడ్డీరేట్లు ఉన్నాయి? అన్నది ఆరా తీయాలి. అలాగే ఈ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చునూ తెలుసుకోవాలి. ఆపై మారితే ఎంత లాభం చేకూరుతుంది? అన్నదీ తెలుసుకోవాలి. వీటన్నిటి తర్వాత మీకు లాభదాయకం ఉంటేనే లోన్ పోర్టబిలిటీకి ముందుకెళ్లాలి. ఇక మీ గృహ రుణం ఫిక్స్డ్ వడ్డీరేటుపై ఉంటే దాన్ని ఫ్లోటింగ్ వడ్డీరేటుకు మారుస్తారా? అన్నదీ కొత్త రుణదాత నుంచి తెలుసుకోవాలి. అన్నీ అనుకూలిస్తేనే తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.