హైదరాబాద్, సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : స్టార్టప్ ఇంక్యూబేటర్ టీ హబ్ సందర్శించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నారు. తాజాగా శనివారం ఆసియా బెర్లిన్ ప్రతినిధులు గచ్చిబౌలిలోని టీ హబ్‌తో పాటు ప్రారంభానికి సిద్దంగా ఉన్న టీహబ్-2 భవనాన్ని కూడా సందర్శించారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకోసిస్టం కలిగిన దేశంగా భారత్‌కు గుర్తింపు ఉందని, అందులో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో స్టార్టప్ కార్యకలాపాలు విసృత్తంగా కొనసాగుతున్నాయని టీ హబ్ ప్రతినిథి ఈ సందర్భంగా తెలిపారు. వార్షికంగా 12-15 శాతం వృద్ధి రేటు ఉండగా, టెక్నాలజీ రంగంలో రోజుకు 2-3 చొప్పున కొత్త స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రస్తుత టీహబ్‌లో స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, కొత్తగా నిర్మిస్తున్న టీహబ్-2 భవనంలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఏసి యా బెర్లిన్ ప్రతినిధుల బృందం ప్రశంసించిందని ఆయన తెలిపారు.