Piyush Goyal | ఏంజిల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు సాయ పడుతుందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి ఆరు శాతానికి తగ్గించడంతో చిన్న చేతివృత్తిదారులకు సాయపడటమే కాక, దేశీయ జెమ్స్, ఆభరణాల ఎగుమతిని ప్రోత్సహిస్తుందని చెప్పారు.
`2024-25 సంవత్సర బడ్జెట్లో ఏంజిల్ టాక్స్ రద్దు చేయడం వల్ల దేశంలోకి ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చు` అని ఆదివారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో జరిగిన ఓ చర్చాగోష్టిలో పీయూష్ గోయల్ చెప్పారు. దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ఆ పారిశ్రామిక టౌన్‌షిప్‌ల్లో ఒకటి మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తామని, దాని వల్ల పరిశ్రమలు, వ్యాపార రంగంలో ఉద్యోగాల కల్పనతోపాటు సమర్థవంతమైన ఏకోసిస్టమ్ తయారుచేయొచ్చునన్నారు.
వజ్రాల వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్లో చర్యలు చేపట్టామని పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలో భారీ సంఖ్యలో నిపుణులైన కార్మికులు ఉండటంతోడైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమకు భారత్ కేంద్రంగా మారిందన్నారు. విదేశీ మైనింగ్ కంపెనీలు ముడి వజ్రాలను దేశీయ మార్కెట్లో విక్రయించడానికి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.