Jio BlackRock | రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్).. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ రంగంలో పట్టు సాధించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఫండ్ మేనేజర్ బ్లాక్ రాక్తో జట్టు కట్టింది. జియో ఫైనాన్సియల్, బ్లాక్ రాక్ కలిసి జియో బ్లాక్ రాక్ అనే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్లో రెండు సంస్థలు చెరో 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,230 కోట్లు) చొప్పున పెట్టుబడులు పెట్టాలని ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల అనుమతి తర్వాత తమ జాయింట్ వెంచర్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని జియో బ్లాక్ రాక్ పేర్కొంది. డిజిటల్ సేవల ద్వారా భారత్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల సొల్యూషన్స్ అందుబాటులోకి తెస్తామని, తద్వారా భారత్ అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో పరివర్తన తేవడమే లక్ష్యంగా పని చేస్తామని వివరించింది.
ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటైన బ్లాక్ రాక్తో తమ భాగస్వామ్యం ఆసక్తికరంగా ఉందని జియో ఫైనాన్సియల్ ప్రెసిడెంట్ కం సీఈఓ హితేశ్ సెథియా తెలిపారు. అమెరికా ఎస్ఈసీ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ రాక్ విలువ 8.6 లక్షల కోట్ల డాలర్లు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.7 లక్షల డాలర్లతో పోలిస్తే రెండింతలకు పై మాటే.
బ్లాక్ రాక్ ఇండియా చైర్మన్ రాచెల్ లార్డ్స్ స్పందిస్తూ తమ జాయింట్ వెంచర్‌కు అసెట్ మేనేజ్మెంట్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. గత నెలాఖరు నాటికి దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో సుమారు రూ.45 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయని ఈక్విటీ, డెట్, ఈటీఎఫ్ ఏఎంఏఫ్ఐ డేటా చెబుతున్నది.