Reliance | కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్’ త్వరలో దేశంలోనే తొలి సొలార్ గిగా ఫ్యాక్టరీ పనులను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. 2035 నాటికి జీరో కార్బన ఉద్గారాల రహిత ఇంధన తయారీ లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు రిలయన్స్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తొలి దశలో 20 గిగావాట్ల సోలార్ ఇంధనం (సోలార్ పీవీ – ఫోటోవోల్టాయిక్) తయారీ ప్రక్రియ చేపడతామని తెలిపింది. 2026 కల్లా దశల వారీగా 20 గిగావాట్ల సోలార్ విద్యుత్ తయారీ దిశగా అడుగులేస్తామని పేర్కొంది. ఈ సోలార్ గిగా ఫ్యాక్టరీలో పీవీ మాడ్యూల్స్, సెల్స్, వాఫర్స్, ఇంగోట్స్, పాలిసిలికాన్, గ్లాస్ తయారు చేస్తారు. సూర్యకాంతిని ఈ మాడ్యూల్స్ విద్యుత్ గా కన్వర్ట్ చేస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సోడియం ఐయాన్ సెల్ తయారీ, 2026లో పైలట్ ప్రాతిపదికగా తొలి 50 మెగావాట్ల లిథియం బ్యాటరీ సెల్స్ తయారీ లక్ష్యంగా ముందుకు వెళుతోంది రిలయన్స్.
సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి మూడేండ్లలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని 2021లో రిలయన్స్ ప్రకటించింది. 2030 నాటికి 100 గిగావాట్ల ఇంధనం తయారు చేయడమే లక్ష్యంగా పేర్కొంది. ఈ ప్రణాళికలో భాగంగా జామ్ నగర్ లోని ప్లాంట్ లో నాలుగు గిగా ఫ్యాక్టరీల నిర్మాణం, బ్యాటరీ స్టోరేజీ, ఫ్యుయల్ సెల్స్, హైడ్రోజన్ తయారీ లక్ష్యమని తెలిపింది.