Reliance | దేశంలోకెల్లా అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాల్లో 43 శాతం పురోగతి నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 42.99 శాతం నికర లాభాలు పెంచుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.13,680 కోట్ల నికర లాభాలు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తిరిగి ఆయిల్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ఖర్చులు 45 శాతం పెరిగి రూ.1,59,133 కోట్లకు చేరుకున్నాయి.
ఆయిల్ టు టెలికం వరకు సేవలందిస్తున్న కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఆపరేషన్స్ ద్వారా 50 శాతం రెవెన్యూ పెంచుకున్నది. గతేడాది రూ.1.16 లక్షల కోట్ల ఆదాయం సంపాదించిన రిలయన్స్.. ఈ ఏడాది రూ.1.74 లక్షల కోట్లకు చేరుకున్నది. ఆపరేటింగ్ లాభాలు 37.16 శాతం పెరిగి రూ.27,876 కోట్లకు చేరాయి.
మా ఆపరేషన్స్ అండ్ ఫైనాన్సియల్ పర్ఫార్మెన్స్లో రిటైల్ సెగ్మెంట్లో శరవేగంగా రికవరీ, ఆయిల్ టు కెమికల్స్, డిజిటల్ సర్వీసెస్ రంగాల్లో సుస్థిర వృద్ధిరేటు కొనసాగిందని రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ డీ అంబానీ తెలిపారు. శరవేగంగా తమ ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ రికవరీ సాధించిందని, అన్ని ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందన్నారు. ఫిజికల్ స్టోర్స్, డిజిటల్ ఆఫరింగ్స్లో శరవేగంగా విస్తరణ సాధించామన్నారు. రెవెన్యూతోపాటు లాభాల పెరుగుదలలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందని చెప్పారు.
తమ డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ జియో.. భారత బ్రాడ్‌బాండ్ మార్కెట్ పరివర్తనలో న్యూ బెంచ్‌మార్క్‌లను సృష్టించిందని ముకేశ్ అంబానీ తెలిపారు. శుక్రవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ షేర్ 0.15 శాతం పెరిగి రూ.2,627.05 వద్ద ముగిసింది.