న్యూఢిల్లీ, మార్చి 4: కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.24,500 కోట్ల (2.81 బిలియన్ డాలర్లు) డిమాండ్ నోటీసు ఇచ్చింది. కేజీ బేసిన్లో రిలయన్స్, బ్రిటీష్ పెట్రోలియం, జపాన్‌కు చెందిన నికో సంస్థలు కలిసి చమురు, గ్యాస్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పక్కనే ఉన్న ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పాదక దిగ్గజం ఓఎన్జీసీకి చెందిన క్షేత్రాల నుంచి వస్తున్న గ్యాస్‌ను రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు వెలికితీసి, అమ్ముకున్నాయన్న వివాదం తలెత్తింది.
ఈ క్రమంలోనే 2016లో 1.55 బిలియన్ డాలర్లు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం రిలయన్స్, ఇతర కంపెనీలకు నోటీసులిచ్చింది. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు రిలయన్స్, కంపెనీలు వెళ్లాయి. 2018 జూలైలో రిలయన్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 2023 మేలో ఢిల్లీ హైకోర్టును ప్రభుత్వం ఆశ్రయించగా, సింగిల్ జడ్జి ధర్మాసనం కూడా రిలయన్స్‌కే మద్దతిచ్చింది. అయితే గత నెల ఫిబ్రవరి 14న దీన్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసు కేంద్రం పంపినట్టు స్టాక్ ఎక్సేంజీలకు రిలయన్స్ తెలిపింది. దీనిపై సవాల్ చేస్తామని కూడా ప్రకటించింది. మరోవైపు బ్యాటరీ సెల్ ప్లాంట్ ఒప్పందాన్ని మీరినందుకు రిలయన్స్‌పై కేంద్రం రూ.50 కోట్ల జరిమానా వేసింది.