న్యూఢిల్లీ, ఆగస్టు 8: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది కూడా వేతనం తీసుకోలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా, ఆర్థిక రంగం ఢీలా పడటంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తన వేతనాన్ని వదులుకున్నట్లు పేర్కొంది.
కరోనా మహమ్మారి కారణంగా 2020-21లోనూ అసలు వేతనాన్ని తీసుకోని ముకేశ్ అంబానీ..ఆ మరుసటి ఏడాది కూడా అదే తీరును కొనసాగించినట్లు తెలిపింది. ఈ రెండేండ్లలో ఎలాంటి అలవెన్స్లు, ముంద స్తు ఖర్చులు, ఇతర ప్రయోజనాలు, కమిషన్లు లేదా స్టాక్ ఆప్షన్లు పొందలేదు.
2008-09 నుంచి 2019-20 వరకు రిలయన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ముకేశ్ అంబానీ రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని పొందిన విషయం తెలిసిందే. మరోవైపు, ముకేశ్ అంబానీ కజిన్స్ నిఖిల్, హిటల్ మేస్వానీలు మాత్రం రూ.24 కోట్ల వార్షిక వేతనం అందుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ల రెమ్యునరేషన్ స్వల్పంగా తగ్గింది. 2021-22 ఏడాదికిగాను ప్రసాద్ రూ.11.89 కోట్లు అందుకోగా, కపిల్ రూ.4.22 కోట్లు అందుకున్నారు.
ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి మాత్రం గడిచిన ఆర్థిక సంవత్సరంలో కమిషన్ల రూపంలో రూ.2 కోట్లు లభించాయి. అలాగే బోర్డు మీటింగ్స్కు హాజరైనందుకుగాను రూ.5 లక్షలు పొందారు. గతంలో ఆమెకు కమిషన్ల రూపంలో రూ.1.65 కోట్లు రాగా, బోర్డు సమావేశాలకు హాజరైనందుకుగాను రూ.8 లక్షలు వచ్చాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైల్ రంగం మరింత బలోపేతం చేయడానికి రిలయన్స్ ఏకంగా రూ.30 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. దీంతో కొత్తగా 2,500 స్టోర్లు అందుబాటులోకి రావడంతోపాటు కొత్తగా 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.