న్యూఢిల్లీ, అక్టోబర్ 17: చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.18,165 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,653 కోట్ల లాభంతో పోలిస్తే 9.6 శాతం వృద్ధిని కనబరుచగా, తొలి త్రైమాసికంలో వచ్చిన రూ.26,994 కోట్ల లాభంతో పోలిస్తే 33 శాతం తగ్గింది. ఇన్వెంటరీ నష్టాలు రెండింతలు కావడం వల్లనే మొత్తం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2.35 లక్షల కోట్ల నుంచి రూ.2.59 లక్షల కోట్లకు ఎగబాకింది.
అంచనాలుమించిన జియో
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ జియో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.7,379 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 12.8 శాతం వృద్ధిని కనబరిచింది. సరాసరిగా ఒక్కో యూజర్‌పై వచ్చే ఆదాయం పెరగడంతోపాటు ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసులు విస్తరించడం కూడా కలిసొచ్చింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14.6 శాతం ఎగబాకి రూ.36,332 కోట్లకు చేరుకున్నది. సరాసరిగా ఒక్కో కస్టమర్‌పై వచ్చే ఆదాయం రూ.195.1 నుంచి రూ.211.4కి చేరుకున్నది.
టెలికాం సేవలు ప్రారంభించి తొమ్మిదేండ్లలోనే అరుదైన ఘనతను జియో సాధించింది. ప్రస్తుతం 50 కోట్లకు పైగా సబ్‌స్ర్కైబర్లకు టెలికాం సేవలు అందిస్తున్నారు. జియో వారి దైనందిన జీవితంలో భాగమైపోయింది.
– ఆకాశ్ ఎం అంబానీ, రిలయన్స్ జియో లిమిటెడ్ చైర్మన్