న్యూఢిల్లీ, నవంబర్ 16: మైగ్రేన్ బాధితులకు గొప్ప ఊరట. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వియరబుల్ థెరపీ డివైజ్ ‘నెరివియో’ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. దీన్ని ధరిస్తే.. ఇక ఔషధాల అవసరం లేకుండానే మైగ్రేన్ నొప్పిని నియంత్రించుకోవచ్చని, దాన్నుంచి ఉపశమనం పొందవచ్చని గురువారం సంస్థ తెలియజేసింది.
ఈ డివైజ్కు అమెరికా ఆహార, ఔషధ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి ఉన్నట్టు ఈ హైదరాబాదీ ఔషధ రంగ దిగ్గజం స్పష్టం చేసింది. కాగా, నెరివియో అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారిత నాన్-ఇన్వేసివ్ డివైజ్. 12 ఏండ్లు, ఆపై వయస్కుల కోసం దీన్ని తయారు చేశారు. చేతి పైభాగాన (భూజం-మోచేయి నడుమ) దీన్ని ధరించవచ్చని, తలనొప్పి మొదలైన 60 నిమిషాల్లోగా దీన్ని వాడితే బాధ నుంచి విముక్తి పొందడానికి ఎక్కువగా వీలుంటుందని కంపెనీ ఈ సందర్భంగా వివరించింది.
అలాగే రోజు విడిచి రోజు దీన్ని ధరించినా మైగ్రేన్ నుంచి గొప్ప ఉపశమనాన్ని పొందవచ్చన్నది. అయితే ఈ డివైజ్ ధర ఎంతన్న వివరాలు మాత్రం తెలియపర్చలేదు. ‘నెరివియోతో డిజిటల్ థెరపీటిక్స్లోకి మా ప్రవేశం జరిగింది. అటు వైద్యులకు, ఇటు రోగులకు చికిత్సలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ డివైజ్ వాడకంతో ట్యాబ్లెట్ల వినియోగం తగ్గుతుంది.
ఇది మైగ్రేన్తోపాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ఊరటనే చెప్పవచ్చు’ అని డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ విభాగం (భారత్, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు) సీఈవో ఎంవీ రమణ అన్నారు. ఇదిలావుంటే యూరోపియన్ దేశాలైన జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, పోలాండ్, స్లోవేకియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, బ్రిటన్లలో నెరివియా మార్కెటింగ్, పంపిణీల కోసం డాక్టర్ రెడ్డీస్ ఇటీవలే అక్కడి సంస్థలతో ఒప్పందాలనూ కుదుర్చుకున్నది.