న్యూఢిల్లీ, నవంబర్ 17 : దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. ఉత్పత్తులపై అమెరికా గరిష్ఠ స్థాయి టారిఫ్‌లను విధించడంతో గత నెలకుగాను ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల స్థాయిలో పతనం చెందింది. అక్టోబర్ నెలలో 34.38 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఎగుమతైన దాంతో పోలిస్తే 11.8 శాతం పతనం చెందాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో భారత్ 76.06 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. కిందటేడాది ఇదే నెలలో చేసుకున్న దిగుమతులతో పోలిస్తే 16.63 శాతం ఎగబాకాయి. దీంతో వాణిజ్యలోటు 41.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్ నెలలోనూ వాణిజ్యలోటు 31.15 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బంగారంతోపాటు వెండి, పత్తి, ఎరువులు, సల్ఫర్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకోవడం వల్లనే వాణిజ్యలోటు పెరిగిందని వెల్లడించింది. మరోవైపు, ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో ఎగుమతులు స్వల్పంగా పెరిగి 254.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 6.37 శాతం ఎగబాకి 451.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 196.82 బిలియన్ డాలర్లు. దేశీయ ఎగుమతులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లను విధించడంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాహన్ తెలిపారు. దీనికితోడు అంతర్జాతీయ దేశాల ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటం, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రధాన మార్కెట్లలో డిమాండ్ గణనీయంగా పడిపోయింది.
ఒకవైపు ఆకాశమే హద్దుగా ధరలు దూసుకుపోయినప్పటికీ బంగారం దిగుమతులు మాత్రం భారీగా పుంజుకున్నాయి. గత నెలకుగాను 14.72 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడి దిగుమతైంది. కిందటేడాది ఇదే నెలలో దిగుమతైన 4.92 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడు రెట్లు అధికమైంది. పండుగ సీజన్‌తోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో డిమాండ్ భారీగా పుంజుకున్నదని పేర్కొంది. అలాగే వెండి దిగుమతులు కూడా 528.71 శాతం ఎగబాకి 2.71 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. అలాగే క్రూడాయిల్ దిగుమతులు మాత్రం 18.9 బిలియన్ డాలర్ల నుంచి 14.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అలాగే ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో పసిడి దిగుమతులు 21.44 శాతం ఎగబాకి 41.23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఎగుమతులు నీరసించాయి. కీలక విభాగాలైన ఇంజినీరింగ్ గూడ్స్, పెట్రోలియం ఉత్పత్తులు, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, దుస్తులు, టెక్స్టైల్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్ గూడ్స్ గణనీయంగా పడిపోవడంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. వీటితోపాటు హస్తకళలు, కార్పెట్, లెదర్, ఇనుప ఖనిజం, టీ, బియ్యం, తంబాకులు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.