ముంబై, జనవరి 29 : బంగారం డిమాండ్‌కు ధరల సెగ గట్టిగానే తగిలింది. 2025లో దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ 11 శాతం తగ్గి 700 టన్నులకు పడిపోయినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరలతోపాటు కొనుగోలుదారులు వెనుకంజ వేయడం కూడా డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణాలని విశ్లేషించింది. మొత్తంమీద గతేడాది గోల్డ్ డిమాండ్ 11 శాతం తగ్గి 710.9 టన్నులకు తగ్గగా..2026లో 600 నుంచి 700 టన్నుల మధ్యలో నమోదుకానున్నట్టు ముందస్తు అంచనాను విడుదల చేసింది. 2024లో మాత్రం 802.8 టన్నుల గోల్డ్ అమ్మకాలు జరిగింది. విలువ పరంగా చూస్తే 2025లో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవడంతో వీటి విలువ 30 శాతం ఎగబాకి రూ.7,51,490 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.5,75,930 కోట్లుగా ఉన్నది.
బంగారం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. న్యూఢిల్లీలో గురువారం పదిగ్రాముల బంగారం ధర రూ.12 వేలు లేదా 7 శాతం ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1.83 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.71 లక్షలుగా ఉన్నది. బంగారంతోపాటు వెండి వెలుగులు జిమ్ముతున్నది. కిలో వెండి ఏకంగా రూ.4 లక్షలను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడం, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన గోల్డ్, సిల్వర్ వైపు మళ్లించడం ధరలు పుంజుకోవడానికి కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 177.14 డాలర్లు ఎగబాకి 5,595.02 డాలర్లకు చేరుకోగా వెండి 3.59 శాతం అందుకొని 120.45 డాలర్లకు చేరుకున్నది.