RBI Dividend | ముంబై, మే 23: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ అందుతున్నది. గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను శుక్రవారం ఏకంగా రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ను సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చరిత్రలోనే ఇది అత్యధికం కావడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన కేంద్ర బోర్డు డైరెక్టర్ల 616వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించే రికార్డు స్థాయిలో ఆర్బీఐ నుంచి ఖజానాకు డివిడెండ్ చేరింది. మునుపెన్నడూ లేనివిధంగా ఆ ఏడాదికి రూ.2.11 లక్షల కోట్లు చెల్లించింది మరి. ఇప్పటిదాకా ఇదే ఆల్‌టైమ్ హై. కానీ ఇప్పుడు దానికంటే 27.40 శాతం అధికంగా మోదీ సర్కారుకు డివిడెండ్ వెళ్తుండటం విశేషం.
ఏటా ఆర్బీఐ మిగులు నగదు నిల్వల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎంతోకొంత డివిడెండ్ రూపంలో వెళ్తుంది. ఈ డివిడెండ్ ఆర్బీఐ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్)పై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నాయకత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా 2019 ఆగస్టులో ఈసీఎఫ్ను డివిడెండ్‌కు ప్రామాణికంగా ఆర్బీఐ తీసుకున్నది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్బీ) 5.5 శాతం నుంచి 6.5 శాతంగా ఉండాలని కమిటీ సూచించింది. అయితే ఈ నెల 15న జరిగిన సమావేశంలో ఈసీఎఫ్ను ఆర్బీఐ సమీక్షించింది. సీఆర్బీని 7.50 శాతానికి పెంచింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గత ఆర్థిక సంవత్సరానికిగాను రికార్డు స్థాయిలో రూ.2,68,590.07 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి ముట్టజెప్పేందుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆర్బీఐ ఓ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.
అప్పట్లో ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ మూడేండ్లకే పరిమితం కావడం, ఆ తర్వాత వచ్చిన ఊర్జిత్ పటేల్ మధ్యలోనే వెళ్లిపోవడం.. అంతా కూడా రిజర్వ్ బ్యాంక్‌పై పెరిగిన కేంద్రం పెత్తనం వల్లేనన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ మిగులు నగదు నిల్వలను ఖజానాకు తరలించాలన్న మోదీ సర్కారు ఎత్తుగడను పటేల్ అడ్డుకున్నారని, ఇది ఆర్బీఐ ఉనికికే ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారని అంటారంతా. ఆర్బీఐ బలహీనపడితే దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు, చివరకు యావత్తు ఆర్థిక వ్యవస్థకే ముప్పని ఆవేదన చెందారని కూడా చెప్తారు.
అయినప్పటికీ ఏదీ ఆగకపోవడంతో తుదకు పటేల్ అర్ధాంతరంగా రాజీనామా చేసి వెళ్లిపోయారన్న అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో ఏరికోరి శక్తికాంత దాస్‌ను ఆర్బీఐ అధిపతిగా చేసింది మోదీ సర్కారు. పెద్ద ఎత్తున డివిడెండ్లు ప్రకటిస్తూపోయిన ఆయన తన హయాంలో చివరి ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఎప్పుడూ లేనంతగా రూ.2,11,000 కోట్ల డివిడెండ్ ప్రకటించేశారు. దాస్ తదుపరి వచ్చిన మల్హోత్రా సైతం ఆర్బీఐ గవర్నర్‌గా తన తొలి ఏడాదిలోనే అంతకుమించి డివిడెండ్ ఇచ్చి కొత్త రికార్డును నెలకొల్పారు.
పాకిస్థాన్‌తో ఘర్షణ వాతావరణం, అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయి డివిడెండ్ ప్రకటించడం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదిప్పుడు. భారత రక్షణ వ్యవస్థ బలోపేతం కావాలన్న ఆకాంక్షలు ఓ వైపు, ట్రంప్ టారిఫ్‌లతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే దిశగా అడుగులు వేయాలన్న అభిప్రాయాలు మరోవైపు గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐ భారీ డివిడెండ్ వెనుక మోదీ సర్కారు ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అన్న సందేహాలు కలుగుతుండటం గమనార్హం.