Diwali Sales | న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశీయ మార్కెట్లో దీపావళి అమ్మకాలు దద్దరిల్లాయి. ఏకంగా రూ.6 లక్షల కోట్లను దాటిపోయాయి. మునుపెన్నడూ లేనివిధంగా రూ.6.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) మంగళవారం తెలియజేసింది. ఇందులో రూ.5.40 లక్షల కోట్లు వస్తు రూపంలో ఉంటే.. రూ.65,000 కోట్లు సేవల రూపేణా జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల రాజధాని నగరాలు సహా 60 ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రధాన నగరాలు, పట్టణాల్లో తమ రిసెర్చ్ విభాగం చేపట్టిన సర్వే ఆధారంగా ఈ లెక్కల్ని సీఏఐటీ వెల్లడించింది. గత ఏడాది దీపావళి విక్రయాలు రూ.4.25 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఈసారి రిటైల్, ముఖ్యంగా నాన్-కార్పొరేట్, సంప్రదాయ మార్కెట్ల లావాదేవీలు.. మొత్తం వాణిజ్యంలో 85 శాతంగా ఉన్నట్టు తాజా సర్వేలో తేలింది. దీంతో భౌతిక మార్కెట్ కార్యకలాపాలు, చిరు వ్యాపారుల అమ్మకాల్లో తిరిగి మునుపటి ఉత్సాహం కనిపించిందని సీఏఐటీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాగా, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపులు సైతం కలిసొచ్చాయన్న అంచనాలు సైతం ఉన్నాయి. ఆయా వస్తూత్పత్తుల ధరలు తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకొచ్చారని సీఏఐటీ అంటున్నది.
ఈసారి దీపావళి అమ్మకాల్లో ప్యాకేజింగ్, ఆతిథ్య, క్యాబ్ సర్వీసెస్, ట్రావెల్, ఈవెంట్ మేనేజ్మెంట్, టెంట్ అండ్ డెకరేషన్, మ్యాన్‌పవర్, డెలివరీ తదితర సేవా రంగాల వాటా రూ.65,000 కోట్లుగా ఉన్నది. చలికాలం, పెండ్లిళ్ల సీజన్, రాబోయే పండుగల దృష్ట్యా జనవరి మధ్యదాకా మార్కెట్లో ఈ జోష్ కనిపించే అవకాశాలున్నాయి.
-బీసీ భార్తీయ, సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు