హైదరాబాద్, జూన్ 11: స్టార్టప్ ఎకోసిస్టమ్ నిర్వహించడంలో ఆసియాలోని అగ్రశ్రేణి నగరాల జాబితాలో హైదరాబాద్ నిలిచింది. పనితీరు, నిధులు, ప్రతిభ, అనుభవం, మార్కెట్లోకి అందుబాటులోకి రావ డం ఐదు వర్టికల్ ఆధారంగా ‘2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్’ను అమెరికాకు చెందిన స్టార్టప్ రీసర్చ్ సంస్థ స్టార్టప్ జినోమ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
100 దేశాలకు చెందిన 300 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఈ జాబితాలలో హైదరాబాద్‌కు 19వ స్థానం లభించింది. దీంతోపాటు మరో ఐదు నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణెలకు కూడా చోటు లభించింది. 2014లో హైదరాబాద్‌లో 200 స్టార్టప్‌లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 7,500కి పైకి చేరుకున్నాయని, స్టార్టప్‌ల ప్రారంభంలో టీ హబ్ కీలక పాత్ర పోషిస్తున్నదని, ఆయా సంస్థలకు ఆర్థిక వనరులు కల్పించడం కూడా ఆవశ్యకమని టీ హబ్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు.