న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లకు చెందిన ఆఫీస్ స్పేస్ 526 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నదని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ మంగళవారం తెలిపింది. ‘రీట్స్: రీషేపింగ్ ఇండియాస్ కమర్షియల్ స్పేస్’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ఈ స్టాక్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లుగా ప్రకటించింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్కతా నగరాల్లో మొత్తం 884.1 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ కార్యాలయ స్థలాలున్నాయని వెస్టియన్ డాటా చెప్తున్నది. ఇందులో రీట్స్కు చెందినదే 526.3 మిలియన్ చదరపు అడుగులని, దీని విలువ రూ.4.5 లక్షల కోట్లు అని స్పష్టం చేసింది. దీనిలో స్టాక్ మార్కెట్లలో నమోదైన రీట్స్ల్లో మూడింటికి చెందినదే 110.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని వివరించింది.
హైదరాబాద్ టాప్
ఆయా నగరాలపరంగా చూస్తే.. హైదరాబాద్లోని మొత్తం ఆఫీస్ స్పేస్లో దాదాపు 74 శాతం రీట్స్ ఆధ్వర్యంలోని ఆఫీస్ స్పేసే కావడం గమనార్హం. అలాగే ముంబై, పుణెల్లోగల ఆఫీస్ స్పేస్లో రీట్స్కు చెందినదే 50 శాతం. అయితే ఈ విషయంలో 24 శాతంతో కోల్కతా ఆఖర్లో ఉన్నట్టు వెస్టియన్ తెలియజేసింది. ఇక ఈ ఏడు ప్రధాన నగరాల్లో రీట్స్కున్న ఆఫీస్ స్పేస్లో 60 శాతానికిపైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎస్సీఆర్లలోనే ఉన్నది. ఇదిలావుంటే భారతీయ రీట్ సంస్థల్లో 4 మాత్రమే స్టాక్ మార్కెట్లలో నమోదయ్యాయని, వీటి ఆధ్వర్యంలో అటు రిటైల్, ఇటు ఆఫీస్ మార్కెట్లలోని స్పేస్ 125 మిలియన్ చదరపు అడుగులని వెస్టియన్ ఈ సందర్భంగా తెలిపింది.