ముంబై, జూన్ 15: పెట్టుబడులు, పొదుపునకు సంబంధించి ఆర్థిక ఉత్పత్తులు లేదా సాధనాలు, సేవల తప్పుడు విక్రయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. సోమవారం కఠిన నిబంధనలను జారీ చేసింది. ఇందులో భాగంగానే ఆయా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, సర్వీస్‌ల అమ్మకాలకు దోహదపడే ప్రోత్సాహక విధానాలను అనుసరించవద్దంటూ బ్యాంకులపై నిషేధం విధించింది. సవరించిన నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే థర్డ్-పార్టీ ప్రొడక్ట్స్, సర్వీసెస్ సహా అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అడ్వైర్టెజింగ్, మార్కెటింగ్, సేల్స్‌పై ఆర్బీఐ ముసాయిదా సవరణ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. వీటిపై వచ్చిన ప్రతిస్పందనలు, అభిప్రాయాల ఆధారంగా ఇప్పుడు తుది ఆదేశాలను ఇచ్చింది. ఇటీవలికాలంలో కస్టమర్లు మోసపోయేలా తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ స్కీముల అమ్మకాలు పెరుగుతుండటంతో ఆందోళన చెందిన ఆర్బీఐ.. వాటికి కళ్లెం వేసేందుకే ఈ కొత్త నిబంధనలను ప్రకటించింది.