బ్యాంక్ కస్టమర్లు నష్టపోతే రూ.25,000 పరిహారం
చిన్నపాటి మోసపూరిత లావాదేవీల్లో నష్టపోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందేలా నూతన విధివిధానాలను తెస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. రూ.85,000 కోట్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధి నుంచి బ్యాంక్ కస్టమర్లకు ఈ పరిహారం చెల్లింపులుంటాయి.
- ఆర్థిక మోసాల్లో బాధితుల కోసం నూతన విధివిధానాలు
- ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
- ఓటీపీ చెప్పి మోసపోయినా వర్తింపు.. జీవితంలో ఒక్కసారే అవకాశం?
- ద్వైమాసిక ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథం
- రుణగ్రహీతలపై కొనసాగనున్న ఈఎంఐల భారం
- ఎంఎస్ఈలకు హామీలేని రుణాలు రెట్టింపు.. రీట్స్కూ బ్యాంక్ లోన్లు!
ముంబై, ఫిబ్రవరి 6 : చిన్నపాటి మోసపూరిత లావాదేవీల్లో నష్టపోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందేలా నూతన విధివిధానాలను తెస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. రూ.85,000 కోట్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధి నుంచి బ్యాంక్ కస్టమర్లకు ఈ పరిహారం చెల్లింపులుంటాయి. అయితే ఉద్దేశపూర్వకంగా మోసపోలేదని తేలితేనే, అదికూడా కస్టమర్ జీవితకాలంలో ఒక్కసారే ఈ పరిహారం అందుతుందని ఆర్బీఐ అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను 3 రోజులపాటు జరిగిన చివరి ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్ష నిర్ణయాలను మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు.
రెపోరేటును ఇప్పుడున్న 5.25 శాతం వద్దే ఉంచేందుకు గవర్నర్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లోని మొత్తం ఆరుగురు సభ్యులూ ఏకగ్రీవంగా అంగీకరించారు. దీంతో అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిపై తొలగిన భయాలతోపాటు ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యమైన స్థాయిలోనే ఉండటంతో ఈసారి వడ్డీరేట్లను ఎక్కడివక్కడే ఉంచాలని ఆర్బీఐ భావించినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన ఇతరత్రా రుణగ్రహీతలపై ఈఎంఐల భారం కొనసాగనున్నది. కాగా, ‘డిజిటల్ చెల్లింపుల భద్రత పెంపునకు అవసరమైన చర్యలపై ఓ చర్చా పత్రాన్ని మేము ప్రచురించాలనుకుంటున్నాం. ఆయా ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ చోటుచేసుకుంటున్న జాప్యంపై దృష్టి పెట్టాలి. అలాగే సీనియర్ సిటిజన్లు ఇతరత్రా వర్గాల ప్రయోజనాల కోసం మెరుగైన ప్రమాణాలను రూపొందించాలి’ అని ఈ సందర్భంగా మల్హోత్రా అన్నారు. ఈ క్రమంలోనే కస్టమర్ల రక్షణార్థం ఆర్బీఐ మూడు రకాల మార్గదర్శకాలను జారీ చేయనున్నదని తెలిపారు.
అందులో మిస్-సెల్లింగ్, లోన్ల రికవరీ.. రికవరీ ఏజెంట్ల ఎంగేజ్మెంట్, అనుమతిలేని డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ల బాధ్యతను పరిమితం చేయడానికి సంబంధించినవి ఉంటాయి. ఇందులోభాగంగానే చిన్నపాటి మోసపూరిత లావాదేవీల్లో వాటిల్లిన నష్టాలకుగాను బాధిత కస్టమర్లకు గరిష్ఠంగా రూ.25,000 వరకు నష్టపరిహారం అందించాలన్న ప్రతిపాదనను ఆర్బీఐ తెరపైకి తీసుకొచ్చింది. పొరపాటున మోసగాళ్లతో ఓటీపీని పంచుకోవడం వల్ల వచ్చే నష్టానికీ పరిహారం అందనున్నదని తెలుస్తున్నది. ముఖ్యంగా వృద్ధులను దృష్టిలో పెట్టుకొనే ఈ పరిహారాన్ని పరిచయం చేయనున్నట్టు సమాచారం. నిజానికి అన్-ఆథరైజ్డ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో కస్టమర్ల బాధ్యతకు సంబంధించి ప్రస్తుతమున్న సూచనలు 2017లో చేసినవి. అయితే నేటి బ్యాంకింగ్ రంగంలో సాంకేతికత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సదరు సూచనలను సమీక్షించి, కొత్త మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా అంటున్నారు.
ఎంఎస్ఈలకు ఊరట
సూక్ష్మ, చిన్నతరహా సంస్థ (ఎంఎస్ఈ)లకు ఆర్బీఐ ఊరటనిచ్చింది. హామీలేని రుణాల పరిమితిని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఎంఎస్ఈలకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణ సదుపాయం లభిస్తున్నది. అయితే దీన్ని రూ.20 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఎంఎస్ఈలకు ఈ సౌలభ్యం అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు త్వరలోనే సూచనలు జారీ కానున్నాయి.
రీట్స్కు బ్యాంక్ రుణాలు?
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్స్)కు బ్యాంకింగ్ రుణాలను ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్)కు బ్యాంక్ రుణాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రీట్స్కూ బ్యాంక్ రుణ సౌకర్యం అందితే దీర్ఘకాలిక వృద్ధికి ఊతమిచ్చినట్టేనన్న అభిప్రాయాలు నిర్మాణ రంగం నుంచి వ్యక్తమవుతున్నాయి. రీట్స్ అనేవి పెట్టుబడి ఆధారిత కంపెనీలు. అవి ఆదాయాన్ని పెంపొందించే రియల్ ఎస్టేట్ను నిర్వహిస్తాయి.
ఆర్బీఐ ద్రవ్య సమీక్ష ముఖ్యాంశాలు
- ఈ ఏడాది ఏప్రిల్-జూన్, జూలై-సెప్టెంబర్ త్రైమాసికాల్లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.9 శాతం, 7 శాతానికి పెరుగవచ్చని అంచనా. గత ఏడాది డిసెంబర్ ద్రవ్య సమీక్షలో 6.7 శాతం, 6.8 శాతంగానే అంచనా వేసిన ఆర్బీఐ.
- ఈ ఏప్రిల్ మొదలు రాబోయే రెండు త్రైమాసికాల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం, 4.2 శాతంగా అంచనా.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం 2.1 శాతంగా నమోదయ్యే వీలున్నది. బంగారం-వెండి మినహా, మిగతావాటి ధరలు అదుపులోనే ఉన్నాయంటున్న రిజర్వ్ బ్యాంక్.
- గత ద్రవ్య సమీక్షలో ఏప్రిల్-జూన్లో 3.9 శాతం, జూలై-సెప్టెంబర్లో 4 శాతం, ఈ ఆర్థిక సంవత్సరం 2 శాతంగానే అంచనా.
- ఆయా ఎన్బీఎఫ్సీల కోసం శాఖల ప్రారంభ నిబంధనలు సడలింపు.
- రికార్డు స్థాయిలో 723.8 బిలియన్ డాలర్లకు దేశంలోని ఫారెక్స్ రిజర్వులు.
- తదుపరి ఆర్బీఐ ద్రవ్య సమీక్ష ఏప్రిల్ 6-8.
వడ్డీరేట్లు తగ్గిస్తాం: మల్హోత్రా
కీలక వడ్డీరేట్లు ఇకపైనా తక్కువ స్థాయిల్లోనే ఉంటాయని, అవసరమైతే తగ్గుతాయని కూడా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెపోరేటు 125 బేసిస్ పాయింట్లు తగ్గిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదిలావుంటే రూ.1,000 కోట్ల కంటే తక్కువ విలువైన ఆస్తులతో ఉన్న చిన్నతరహా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లను తప్పనిసరి రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించారు. కాగా, యూపీఐ లావాదేవీలు మరింత పెరిగేలా కృషి చేస్తామన్నారు. అలాగే బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులపైనా స్పందించారు. పసిడి రుణాలపై ఆందోళన అక్కర్లేదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

