RBI | ముంబై, అక్టోబర్ 9: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇన్నాళ్లూ అవలంబించిన కఠిన ద్రవ్య విధానానికి స్వస్తి పలికింది. ఈ మేరకు బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకున్నది. ఇకపై ‘న్యూట్రల్’ పాలసీని అనుసరిస్తామని స్పష్టం చేసింది. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లు తగ్గుతాయన్న సంకేతాలను ఇచ్చింది.
కాగా, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరిని కఠినం నుంచి తటస్థానికి మార్చేందుకు కొత్త సభ్యులతో కొలువుదీరిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లోని అందరూ అంగీకరించారు. 2019 జూన్ నుంచి చూసినైట్టెతే ఆర్బీఐ తటస్థ ద్రవ్య విధాన వైఖరిని తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ విధానంలో ద్రవ్యోల్బణం, జీడీపీ డాటాల ఆధారంగా వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది.
ఆర్బీఐ ప్రధానంగా మూడు ద్రవ్య విధాన వైఖరిలను ప్రదర్శిస్తుంది. అందులో హాకిష్ పాలసీ ఒకటైతే, మరొకటి డోవిష్ పాలసీ. ఇంకొకటే న్యూట్రల్ పాలసీ. హాకిష్ పాలసీలో ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వడ్డీరేట్లను అధిక స్థాయిల్లోనే ఉంచుతుంది. వడ్డీరేట్లను పెంచడం తప్ప తగ్గించదు. ఇక డోవిష్ పాలసీలో జీడీపీ వృద్ధికి పెద్దపీట వేస్తుంది. మార్కెట్లో ద్రవ్య సరఫరా పెరిగేలా, రుణ లభ్యతను పెంచేలా వడ్డీరేట్లను తగ్గిస్తూ ఉంటుంది. కాగా, తదుపరి ద్రవ్యసమీక్ష డిసెంబర్ 4-6.
రెపోరేటును ఈసారి ద్రవ్యసమీక్షలోనూ 6.5 శాతం వద్దే ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో ఐదుగురు దీన్ని సమర్థించారు. ఇది 10వసారి కావడం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరిలో 6.25 శాతం నుంచి 6.5 శాతానికి మార్చింది. ఆ తర్వాతి నుంచి ఇది అక్కడే ఉన్నది. దీంతో ఆటో, గృహ, కార్పొరేట్, వ్యక్తిగత, ఇతరత్రా రుణాలపై వడ్డీరేట్లూ తగ్గడం లేదు. రెపోరేటు ఆధారంగానే బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లను సవరిస్తాయి.
దీంతో ఆర్బీఐ ఆ రేటును తగ్గిస్తే ఆయా రుణాలపై వడ్డీరేట్లూ తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. కరోనాతో పడకేసిన దేశ ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు వడ్డీరేట్లను బాగా తగ్గించిన ఆర్బీఐ.. ఆ తర్వాత విజృంభించిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి పెంచింది. అయితే రాబోయే రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందన్న ఆశలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు ద్రవ్య విధానం మారేందుకు దోహదం చేశాయి.
కొన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లోని ప్రమోటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా హెచ్చరించారు. తమ సంస్థలను వేగంగా విస్తరించాలని, అభివృద్ధిపర్చాలని తప్పుడు దారుల్లో వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల రిస్క్ పెరుగుతుందని సూచించారు.
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోసేలా ఉన్నాయని, కాబట్టి రాబోయే ద్రవ్యసమీక్షల్లో తప్పకుండా కీలక వడ్డీరేట్లు తగ్గుతాయని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సుదీర్ఘకాలంపాటు కఠిన ద్రవ్యవిధానాన్ని అవలంభించిన ఆర్బీఐ.. తాజా ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో దాన్ని వీడుతున్నట్టు ప్రకటించింది.
వడ్డీరేట్లపై నిర్ణయంలో ఇకపై ‘న్యూట్రల్’ పాలసీని అనుసరిస్తామని స్పష్టం చేసింది. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలు, అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాస్ పైవిధంగా స్పందించారు. పరిస్థితులనుబట్టి వడ్డీరేట్ల యథాతథ స్థితి, తగ్గింపులపై నిర్ణయాలుంటాయని తేల్చిచెప్పారు.
అయితే ద్రవ్యోల్బణంపై పోరులో ఇప్పటిదాకా ఆర్బీఐ వైఖరి ఏనుగులా సాగిందని, ఇక నుంచి గుర్రం మాదిరి దూకుడుగా ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుంటే అధిక వడ్డీరేట్లతో వృద్ధిరేటుకు వచ్చే ముప్పేమీ లేదని దాస్ అన్నారు. గత ఏడాదిన్నర కాలంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు బాగానే సాగుతున్నాయని గుర్తుచేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చిలో అంచనాలను మించి వృద్ధిరేటు నమోదవుతుందన్న ఆశాభావాన్ని కనబర్చారు.
దేశంలో డిజిటల్ చెల్లింపులను వీలైనంత ఎక్కువగా పెంచాలని చూస్తున్న ఆర్బీఐ.. తాజా ద్రవ్యసమీక్షలో ఆ మేరకు మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నది. ఇందులో భాగంగానే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లైట్ వ్యాలెట్కున్న పరిమితిని రూ.5,000కు పెంచింది. ప్రస్తుతం ఇది రూ.2,000గానే ఉన్నది. అలాగే ఒక్కో లావాదేవీకున్న పరిమితిని కూడా రూ.1,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడిది రూ.500లు మాత్రమే.
ఇక యూపీఐ123పేలోనూ ఒక్కో లావాదేవీ పరిమితిని ప్రస్తుతమున్న రూ.5,000ల నుంచి రూ.10,000 పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలియజేశారు. స్మార్ట్ఫోన్లను వినియోగించని ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం 2022 మార్చిలో యూపీఐ123ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సౌకర్యం 12 భాషల్లో అందుబాటులో ఉన్నది. ఇదిలావుంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) సిస్టమ్స్ల్లో బెనిఫీషియరీ అకౌంట్ పేరు కనిపించే వెసులుబాటును తెస్తున్నట్టు దాస్ వెల్లడించారు. వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈసారి వడ్డీరేట్లను తగ్గిస్తే ఈ పండుగ సీజన్లో హౌజింగ్ డిమాండ్ పుంజుకొనేది. అటు రియల్ ఎస్టేట్ రంగంలో, ఇటు యావత్తు ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటును పరుగులు పెట్టించే ఓ మంచి అవకాశాన్ని ఆర్బీఐ చేజార్చుకున్నది.
-బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు
వృద్ధిరేటు పెరుగుదలను, ద్రవ్యోల్బణం తగ్గుదలను ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయి. ద్రవ్య విధాన వైఖరిని ఆర్బీఐ ‘న్యూట్రల్’కు మార్చడం వల్ల రాబోయే ద్రవ్యసమీక్షల్లో రెపోరేటు తగ్గేందుకున్న అవకాశాలు పెరిగాయి. దీనివల్ల అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి.
-బ్యాంకింగ్ సంస్థలు
ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానాన్ని వీడటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇకనైనా వడ్డీరేట్లను తగ్గించి వృద్ధిరేటు పురోగతికి సహకారాన్ని అందించాలి. రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఆ మేరకు నిర్ణయాలుంటాయని ఆశిస్తున్నాం.
-దీపక్ సూద్, అసోచామ్ ప్రధాన కార్యదర్శి