RBI | ముంబై, ఫిబ్రవరి 6: ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరుగుతున్న తొలి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలే ఎక్కువగా వస్తున్నాయి. శుక్రవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్బీఐ ప్రకటించనున్నది. అయితే ఇటీవలి బడ్జెట్ నేపథ్యంలో ఈ ద్రవ్యసమీక్షపై అటు వ్యాపార-పారిశ్రామిక రంగాలు, ఇటు బ్యాంకర్లు-రుణగ్రహీతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే రెపో రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) కోత పెట్టవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. నిజానికి గత ద్రవ్యసమీక్షలో అప్పటి గవర్నర్ శక్తికాంత దాస్.. మున్ముందు పాలసీ రివ్యూల్లో వడ్డీరేట్లు తగ్గవచ్చన్న సంకేతాలనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమీక్ష మిక్కి లి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
గత రెండేండ్లుగా వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ ద్రవ్యసమీక్షలు ముగుస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా రెపో రేటును 6.50 శాతానికి పెంచారు. అప్పట్నుంచి ఇది అక్కడే ఉంటున్నది. ఇక రెపో రేటును ఆఖరిసారిగా తగ్గించింది 2020 మే నెలలోనే. కరోనా దెబ్బకు దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థలో నూతనోత్సాహాన్ని నింపేందుకు నాటి గవర్నర్ దాస్ ప్రత్యేకంగా ఆర్బీఐ సమీక్ష నిర్వహించి రెపో రేటును తగ్గించారు. రుణ లభ్యత పెరిగేలా 4 శాతానికి దించారు. కానీ ద్రవ్యోల్బణం విజృంభించడంతో తదుపరి ద్రవ్యసమీక్షల్లో దాన్ని అదుపు చేసేందుకు మళ్లీ వడ్డీరేట్లను వరుసగా పెంచుతూపోయారు. ఈ క్రమంలో ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు తగ్గితే ఐదేండ్ల తర్వాత ఇప్పుడే తగ్గినట్టు కానున్నది.
గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై చాలాకాలం నుంచి అధిక వడ్డీరేట్లనే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు అనుసరిస్తున్నాయి. ఫలితంగా ఆయా రుణగ్రహీతలు, వివిధ వ్యాపార రంగాలు ప్రభావితమవుతున్నాయి. కానీ ఈసారి ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే రియల్టీ, ఆటోతోపాటు పలు రంగాల్లో తిరిగి అమ్మకాలు పుంజుకుంటాయంటున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుంకాలను పెంచుతూ వాణిజ్య యుద్ధానికి తెరతీస్తున్న నేపథ్యంలో వడ్డీరేట్ల తగ్గింపు తొందరపాటే అవుతుందంటున్నవారూ లేకపోలేదు. ముఖ్యంగా వడ్డీరేట్లు తగ్గితే రూపాయిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠాల్లో కదలాడుతున్న సంగతి విదితమే. కానీ దేశంలో వినిమయ శక్తిని పెంపొందించడానికి బడ్జెట్లో తన వంతుగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయ పన్ను ఊరటను కల్పించింది. ఈ క్రమంలో ఆర్బీఐ వంతుగా వడ్డీరేట్లను తగ్గించవచ్చన్న అంచనాలే ఎక్కువగా ఉన్నాయి.