న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : ‘రేయ్.. అర్జంటుగా ఓ పది వేలు పంపించు. ఆ అలాగే.. వచ్చాయ్ చూస్కో. థాంక్స్ రా’. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా చెప్పుకుంటూపోతే మనలో చాలామందికి ఎప్పుడో.. ఎక్కడో అన్నవి, విన్నవే ఈ మాటలు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సదుపాయం వచ్చాక ఆర్థిక లావాదేవీలు ఎంతో సులభమైపోయాయి మరి. ఇంచుమించుగా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ ఉండటంతో ఎవరికైనా నగదు పంపించాలన్నా లేదా ఎవరి నుంచైనా తీసుకోవాలన్నా.. క్షణాల్లో జరిగిపోతున్నది. ఈ మెరుపు వేగమే యూపీఐని అంత పాపులర్ చేసిందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఇకపై ఈ స్పీడ్ ఉండదేమో. అవును.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదన ఆచరణలోకి వస్తే ఇంతే మరి.
యూపీఐ సేవలు.. భారతీయ ఆర్థిక రంగ ముఖచిత్రాన్నే మార్చేశాయి. రోజూ కోట్లాది లావాదేవీలు అలవోకగా జరిగిపోతున్నాయిప్పుడు. అయితే అంతే స్థాయిలో ఆన్లైన్ మోసాలూ పెరిగిపోతున్నాయి. అక్రమార్కుల దెబ్బకు అమాయకులు పెద్ద ఎత్తున నష్టపోతున్నదీ చూస్తూనే ఉన్నాం. నిజానికి బ్యాంక్ ఖాతాదారులు ఈ కేటుగాళ్ల బారినపడకుండా ఆర్బీఐ ఎప్పటికప్పుడు అనేక రకాల నిర్ణయాలను, చర్యలను తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఓ కొత్త ప్రతిపాదనను చేసినట్టు సమాచారం. రూ.10,000, ఆపై నగదు మొత్తాలను గూగుల్‌పే, ఫోన్‌పే తదితర యూపీఐ వేదికల ద్వారా పంపినప్పుడు.. అది రిసీవర్ ఖాతాలో క్రెడిట్ అవ్వాలంటే గంట సమయం పట్టేలా రూల్స్‌ను మార్చాలని చూస్తున్నది. కానీ సెండర్ అకౌంట్ నుంచి వెంటనే సదరు మొత్తం డెబిట్ అయినట్టు చూపిస్తుంది. అయినప్పటికీ ఒకవేళ ఏవైనా పొరపాట్లు జరిగినా, ఒకరికి బదులుగా మరొకరికి పంపించామనుకున్నా, పంపినవారు సదరు లావాదేవీని వద్దని భావించినా లేదా మోసపోయామని గుర్తించినా.. ఆ సొమ్ము బ్యాంకర్ల సహకారంతో తిరిగి వారి ఖాతాలోకే వచ్చేలా నిబంధనల్ని మార్చాలని ఆర్బీఐ చూస్తున్నదని చెప్తున్నారు. మరోవైపు బ్యాంకులు సైతం ఈ గంట సమయంలో క్రాస్ చెక్ చేసుకోవడానికి సమయం ఉంటుందని, లావాదేవీ అసాధారణంగా కనిపించినా, ఓ కొత్త ఖాతాలోకి భారీ మొత్తం వెళ్తున్నా.. ఖాతాదారులను అలర్ట్ చేయవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఆర్బీఐ ‘గంట ఆలస్యం’ ప్రతిపాదన ప్రకారం అకౌంట్-టు-అకౌంట్ జరిగే నగదు బదిలీలు.. అదికూడా యూపీఐ ద్వారా రూ.10,000, ఆపై నగదు లావాదేవీలే ప్రభావితమయ్యే వీలున్నది. రూ.10,000 లోపు లావాదేవీలన్నీ క్షణాల్లోనే పూర్తవుతాయి. అలాగే దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఇతరత్రా చోట్ల క్యూఆర్ కోడ్ల ద్వారా జరిపే యూపీఐ లావాదేవీలు ఎప్పట్లాగే సజావుగా జరిగిపోతాయి. మన బ్యాంక్ ఖాతాల నుంచి జరిగే ఈఎంఐ చెల్లింపులు, చెక్ క్లియరెన్స్లకూ ఢోకా లేదని తెలుస్తున్నది. కాగా, ఆర్బీఐ వివరాల ప్రకారం.. మొత్తంగా నమోదవుతున్న ఆన్లైన్ ఆర్థిక మోసాల్లో రూ.10,000, ఆపై నగదు లావాదేవీల సంఖ్యనే దాదాపు 45 శాతంగా ఉన్నది. కానీ జరుగుతున్న నష్టంలో వీటి వాటానే సుమారు 98.5 శాతంగా ఉంటుండటం గమనార్హం. అందుకే వీటిపైనే దృష్టిపెట్టిన ఆర్బీఐ.. ఈ కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. దీనిపై ఎవరైనా మే 8కల్లా స్పందించవచ్చని కూడా చెప్తున్నది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకోనున్నది. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో అనేక మార్పులు చోటుచేసుకునేలా ఉన్నాయి. కొన్ని లావాదేవీలు మందగించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మరింత సురక్షిత లావాదేవీలకూ ఆస్కారం ఉంటుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు.. స్కామర్ల చేతికి చిక్కకుండా ఉంటారని చెప్తున్నారు.
ఎగువ శ్రేణి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల గుర్తింపు కోసం అనుసరించే ప్రమాణాల్లో ఆర్బీఐ శుక్రవారం మార్పుల్ని ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న ఆస్తుల పరిమాణం, పారామెట్రిక్ స్కోరింగ్ సిస్టమ్‌లతో కూడిన రెండంచెల విధానానికి బదులుగా ఒక్క ఆస్తుల పరిమాణం ఆధారిత విధానాన్నే సూచించింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలూ అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీల్లో ఉండవచ్చన్నది. ఇప్పుడున్న విధానం ప్రకారం సర్కారీ ఎన్బీఎఫ్సీలు.. బేస్ లేయర్, మిడిల్ లేయర్లకే పరిమితమయ్యాయి మరి. ఇక ఆర్బీఐ డ్రాఫ్ట్ (ఎన్బీఎఫ్సీ నమోదు, మినహాయింపులు, స్కేల్ ఆధారిత నియంత్రణ కోసం విధివిధానాలు) రెండో సవరణ మార్గదర్శకాలు-2026 ప్రకారం.. ఎగువ శ్రేణి ఎన్బీఎఫ్సీలు రూ.లక్ష కోట్లకుపైగా ఆస్తుల్ని కలిగి ఉండాలి.