హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో భారతదేశంలోని రైతులకు తీవ్ర నష్టమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మధురస్వామినాథన్ పేర్కొన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మీనారాయణ ఎనిమిదో స్మారకోపన్యాసంలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ జానాభాలో మన దేశ జనాభా 18 శాతం ఉండగా, మన ఉత్పత్తులు 13 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. మన దేశం నుంచి కేవలం 3 శాతం ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయని, 97శాతం దేశంలోనే వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఈ పరిస్థితుల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన రైతులకు ఏవిధంగా ఉపయోగపడుతాయని ప్రశ్నించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్లలో రైతులకు పెద్దమొత్తంలో నగదు సబ్సిడీలను ప్రభుత్వాలు అందజేస్తాయని, మన దేశంలో నామమాత్రంగా ఏడాదికి రూ.6వేల సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.
ఎఫ్సీఐ గోదాములను అదానీ కంపెనీలకు అప్పగిస్తే విపత్కర పరిస్థితుల్లో ఆహార భద్రతా సమస్య తలెత్తుతుందని మధురస్వామినాథన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘దేశంలో వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ వైపు వెళ్తున్నది. 80 శాతం ట్రాక్టర్లు నాలు గు కంపెనీల చేతుల్లో, విత్తనాల కంపెనీలు 67శాతం ప్రైవేట్ చేతుల్లో ఉన్నాయి. వరి, గోధుమ మినహాయిస్తే మిగిలిన పంటల విత్తనాలన్నీ 80 నుంచి 100 శాతం విత్తనాలు కార్పొరేట్ కంపెనీలకు చెందినవే’ అని ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్లు రంగారావు, వీరభద్రరావు, లతీఫ్ పాషా, సురేశ్, సుదర్శన్రావు, సాగర్, సారంపల్లి మల్లారెడ్డి, శోభన్ పాల్గొన్నారు.