RBI on GDP | వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధిరేటు 7.8 శాతానికి పరిమితం అవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9.2 శాతానికి దిగి వస్తుందని పేర్కొంది. ఇప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడలేదు. ప్రైవేట్ వినియోగం, కాంటాక్స్ ఇన్సెంటివ్ సర్వీస్లు.. తదితర కార్యకలాపాలు కరోనా ముందునాటి స్థాయికి చేరుకోలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ద్రవ్య పరపతి విధానంపై ఆర్బీఐ వైఖరిని గురువారం మీడియాకు వెల్లడించారు.
దేశీయంగా గ్రోత్ డ్రైవర్స్ క్రమంగా మెరుగు పడుతున్నాయి. ఈ అంశాలను పరిగణలనోకి తీసుకుంటే 2022-23లో జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగానూ, తొలి త్రైమాసికంలో 17.2 శాతంగా, ద్వితీయ త్రైమాసికంలో 7, మూడో త్రైమాసికంలో 4.3, నాలుగో త్రైమాసికంలో 4.5% వృద్ధి రేటు నమోదవుతుంది అని శక్తికాంత దాస్ తెలిపారు. పెట్టుబడి వ్యయం పెంచడం ద్వారా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధికి వచ్చే ఏడాది బడ్జెట్ దోహద పడుతుందన్నారు. ప్రయివేట్ పెట్టుబడులతో బహుళ రూపాల్లో అభివృద్ధి నమోదవుతుందని చెప్పారు.
గత నెల ఏడో తేదీన నేషనల్ స్టాస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 9.2 శాతానికి పరిమితం అవుతుంది. ఇది 2019-20 నాటి స్థాయిని అధిగమించినట్లే. ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరగడంతో కాంటాక్ట్ ఇన్సెంటివ్ సర్వీసులపై గత నెలో ప్రభావం పడిందన్నారు శక్తికాంత దాస్. దీని ప్రభావంతో గత నెలలో డిమాండ్ కొంత బలహీన పడిందన్నారు.