ముంబై, ఆగస్టు 10: ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంక్ తీసుకున్న అనూహ్య నిర్ణయం స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. మార్కెట్లో నగదు చలామణిని తగ్గించడానికి సీఆర్ఆర్ను పెంచడం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా సెల్లింగ్ బటన్ నొక్కడంతో ఒక దశలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 307.63 పాయింట్లు తగ్గి 65,688.18 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 89.45 పాయింట్లు కరిగిపోయి 19,543.10 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, నెస్లె, టాటా మోటర్స్, హెచ్సీఎల్ టెక్నాలజీ, మారుతి, హెచ్యూఎల్ షేర్లు నష్టపోయాయి. కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రాలు లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే టెలికం, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఐటీ, రియల్టీ, టెక్, కమోడిటీ రంగ షేర్లు నష్టపోగా..ఎనర్జీ, యుటిలిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, మెటల్, పవర్ రంగ షేర్లు నష్టపోయాయి.
బ్యాంకింగ్, రియల్టీ, వాహన రంగ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. బ్యాంకింగ్ సిస్టమ్లో నగదును తగ్గించే నిర్ణయం తీసుకోవడంతో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐలు రెండు శాతం వరకు నష్టపోయాయి.